జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తీరు గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా తయారైంది. ఈ విషయం ఆయన అడుగడుగునా స్పష్టం చేస్తూ సాగుతున్నారు. ఆశలావు పీక సన్నం అన్నట్టుగా పవన్ కల్యాణ్ మత రాజకీయాలు చేస్తూ కనిపిస్తున్నారు. ఒక రోజు హిందూ ఓట్ల కోసం మత వ్యాఖ్యలు చేస్తారు. రెండో రోజు మైనారిటీలను బుజ్జగించడానికి హిందువుల వల్లనే లౌకిక వాదానికి ముప్పు, హిందువుల వల్లనే మత కలహాలు అని అంటున్నాడు.
పవన్ కల్యాణ్ తీరు ఇలా ప్రహసనంగా మారింది. రాజకీయాల్లోని సున్నితత్వాన్ని పవన్ కల్యాణ్ గ్రహించలేకపోతున్నాడు. హిందువులను రెచ్చగొట్టి వారిని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నాలనూ పవన్ తీవ్రంగానే చేస్తూ ఉన్నాడు. అలా చేస్తే మైనారిటీ ఓట్లు పూర్తిగా దూరం అవుతాయనే భయంతోనూ ఆయన కనిపిస్తున్నాడు. అందుకే మతకలహాలు హిందువుల వల్లనే అంటూ మరో ప్రకటనా చేశాడు.
ఈ రెండు రకాల వెర్షన్లలోనూ పవన్ కల్యాణ్ లో ఒక కుటిల రాజకీయ నేత మాత్రమే కనిపిస్తూ ఉన్నాడు. పవన్ కల్యాణ్ మాట్లాడే ఏ రకమైన మాటల్లోనూ ఎలాంటి సంబంద్ధతా కనిపించదు. ప్రజల్లో మతం, కులం భావోద్వేగాలను రెచ్చిగొట్టి రాజకీయంగా ఎదగాలనే ప్రయత్నమే పవన్ కల్యాణ్ లో కనిపిస్తూ ఉంది.
తను హీరోగానే నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో విలన్ పాత్ర ప్రకాష్ రాజ్ ను గుర్తు చేస్తూ ఉంది పవన్ కల్యాణ్ తీరు. ఆ సినిమాలో ప్రకాష్ పాత్రకు దేశంలోని పలు ప్రాంతీయ వాద, మత వాద రాజకీయ నేతల తీరు స్ఫూర్తిగా నిలిచింది. రాజ్ ఠాక్రే వంటి వారి ధోరణి ఆ పాత్రలో కనిపిస్తుంది. అయితే ఆ పాత్ర లోని కుటిల రాజకీయానికి ఎన్నో రెట్లు ఎక్కువ కుటిలత్వం పవన్ కల్యాణ్ రాజకీయంలో కనిపిస్తూ ఉంది. హిందువులు, ముస్లింలు కొట్టుకోవాలనే రీతిలో పవన్ కల్యాణ్ ఉద్రేకాలను రెచ్చగొడుతూ ఉన్న వైనం స్పష్టం అవుతోంది.