బాబు అరెస్ట్‌పై నిజాలు దాచి…ఎల్లో మీడియా వంచ‌న‌!

చంద్ర‌బాబునాయుడి అరెస్ట్ వెనుక అస‌లు వాస్త‌వాల్ని టీడీపీ నేత‌లు, ఎల్లో మీడియా దాస్తున్నారా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. త‌ద్వారా టీడీపీ శ్రేణుల్ని వంచిస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కామ్‌లో అవినీతికి ప్ర‌ధాన…

చంద్ర‌బాబునాయుడి అరెస్ట్ వెనుక అస‌లు వాస్త‌వాల్ని టీడీపీ నేత‌లు, ఎల్లో మీడియా దాస్తున్నారా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. త‌ద్వారా టీడీపీ శ్రేణుల్ని వంచిస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కామ్‌లో అవినీతికి ప్ర‌ధాన కార‌కుడు చంద్ర‌బాబు అని తేల్చి ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. అనంత‌రం ఆయ‌న్ను రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. బాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ప‌లువురు ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు.

టీడీపీకి బ‌ల‌మైన మీడియా అండ ఉండ‌డంతో దేశ‌మంతా బాబు అరెస్ట్‌ను ఖండిస్తున్న వాతావ‌ర‌ణాన్ని సృష్టించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఇదే సంద‌ర్భంలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు, సామాన్య ప్ర‌జ‌ల అనుమానాన్ని నివృత్తి చేయ‌డంలో ఎల్లో మీడియా పూర్తిగా విఫ‌ల‌మైంది. పైగా బాబు అరెస్ట్‌కు అస‌లు సూత్ర‌ధారుల ఖండ‌న వార్త‌ల‌ను ప్ర‌ధానంగా ప్ర‌చురించ‌డం, ప్ర‌సార చేయ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

మాజీ ముఖ్య‌మంత్రి, జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న చంద్ర‌బాబునాయుడిని అరెస్ట్ చేయ‌డం కేవ‌లం జ‌గ‌న్ ప్ర‌భుత్వం వల్లే సాధ్యం కాద‌నేది ప్ర‌తి ఒక్క‌రి అభిప్రాయం. రాజ‌కీయంగా చంద్ర‌బాబును అడ్డు తొల‌గించుకుంటే, రానున్న రోజుల్లో తాము బ‌ల‌ప‌డొచ్చ‌నే వ్యూహంతో కేంద్రంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీ గేమ్ ఆడుతోంద‌నే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. అస‌లు నిజం ఇదేతై, బీజేపీ నేత‌ల అభిప్రాయాల్ని ప్ర‌ముఖంగా ప్ర‌చురించ‌డం ఏంట‌నే నిలదీత టీడీపీ శ్రేణుల నుంచి వ‌స్తోంది.

మ‌రీ ముఖ్యంగా రెండు రోజులుగా తెలంగాణ బీజేపీ నేత‌ల నుంచి బాబు అరెస్ట్‌పై ఖండ‌న వార్త‌లు రావ‌డం వెనుక కుట్ర రాజ‌కీయం వుంద‌ని అనుమానిస్తున్నారు. చంద్ర‌బాబును రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు పంపడంలో వెన‌కుండి అన్ని ర‌కాలుగా స‌హ‌క‌రించి, తీరిగ్గా ఖండ‌న‌లు ఇస్తే న‌మ్ముతార‌ని ఎలా అనుకుంటున్నార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

చంద్ర‌బాబుకు ముంద‌స్తు నోటీసులు ఇవ్వ‌కుండా, ఎఫ్ఐఆర్‌లో ఆయ‌న పేరు లేకుండా అరెస్ట్ చేయ‌డం స‌మంజ‌సం కాదంటూ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ కె. లక్ష్మణ్, అలాగే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బండి సంజ‌య్‌, తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు ఎన్‌వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్ త‌దిత‌రులు పేర్కొన్నారు. బాబు అరెస్ట్‌తో త‌మ‌కేమీ సంబంధం లేద‌ని చెప్ప‌డానికే బీజేపీ నేత‌లు పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నార‌ని టీడీపీ నేత‌లు అనుమానిస్తున్నారు. 

బాబు అరెస్ట్ అన్యాయ‌మ‌ని నిజంగా వారు భావిస్తుంటే, మ‌రి ఆయ‌న్ను విడిపించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని, ర‌క‌ర‌కాల భ‌యాల‌తో ఆ పార్టీని ఏమీ ప్ర‌శ్నించ‌లేని ద‌య‌నీయ స్థితిలో టీడీపీ, ఎల్లో మీడియా ఉన్నాయ‌ని కార్య‌క‌ర్త‌లు వాపోతున్నారు.