ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మాలని, అలాగే రోజుకు నాలుగు షోలు మాత్రమే వేసేలా ఏపీ ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకురావడంపై చర్చ జరుగుతోంది. సినీ రంగానికి సంబంధించి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన బిల్లుపై మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా స్పందించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అభినందిస్తూనే, మరోవైపు చిత్ర పరిశ్రమ నిలదొక్కుకోవాలంటూ చేయూత ఇవ్వాలని విన్నవించారు. దీనిపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ముందుగా చిరు ట్వీట్ ఏంటి, దానిపై నాని స్పందన ఏంటో తెలుసుకుందాం.
పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్ టికెట్ విధానాన్ని తీసుకురావడాన్ని మెగాస్టార్ చిరంజీవి హర్షించారు. అదే విధంగా థియేటర్ల మనుగడ కోసం, అలాగే సినిమానే జీవితంగా బతుకుతున్న కుటుంబాల ఉపాధి కోసం..మిగిలిన రాష్ట్రాల్లో మాదిరిగానే టికెట్స్ రేట్లు పెంచాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. తన వినతిపై పునరాలోచించాలని చిరంజీవి చేసిన విజ్ఞప్తికి ఏపీ ప్రభుత్వ సానుకూలంగా స్పందించింది.
చిరు ట్వీట్‌కు సమాధానం చెప్పేందుకు పేర్ని నాని ప్రెస్‌మీట్ పెట్టారు. చిరంజీవితో పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా టికెట్ల పెంపుపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారన్నారు. ఈ విషయమై సీఎంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని చిరంజీవికి చెప్పినట్టు నాని తెలిపారు.
అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ చర్యలు ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిజీగా వుండడం వల్ల సినీ పరిశ్రమ ప్రముఖులను కలవలేకపోతున్నారని తెలిపారు. ముఖ్యంగా చిరు ట్వీట్‌పై ప్రభుత్వం సానుకూలంగానే స్పందించనున్నట్టు సమాచారం.