టాలీవుడ్ కు జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టేనా!

ఏపీ ప్రజలకు, ముఖ్యంగా సినిమా ప్రేక్షకులకు మేలు చేసే నిర్ణయం తీసుకుంటూనే.. పనిలో పనిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి కూడా స్క్రూ బిగించేశారు సీఎం జగన్. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట.  Advertisement…

ఏపీ ప్రజలకు, ముఖ్యంగా సినిమా ప్రేక్షకులకు మేలు చేసే నిర్ణయం తీసుకుంటూనే.. పనిలో పనిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి కూడా స్క్రూ బిగించేశారు సీఎం జగన్. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట. 

జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఏనాడూ టాలీవుడ్ ఆయన్ను పట్టించుకోలేదు. పొరుగు రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే జయజయధ్వానాలు పలికిన టాలీవుడ్ జనాల నోళ్లు.. జగన్ సీఎం అయినప్పుడు మాత్రం మూగబోయాయి.

దీనిపై అప్పట్లో పోసాని, 30ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి లాంటి వాళ్లు బాహాటంగానే తమ నిరసన తెలియజేశారు. సినీ పెద్దల్ని పరోక్షంగా విమర్శించారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇండస్ట్రీ, ఏపీ ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు. ఆపత్కాల సమయంలో ఏపీ ప్రజల్ని ఆదుకునే విషయంలో సకాలంలో ముందుకురాలేదు. దీనికితోడు టాలీవుడ్ లో ఎక్కువమంది టీడీపీ జనాలనే విషయం బహిరంగ రహస్యం.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చాలామంది సినీజనాలు రాసుకుపూసుకు తిరిగారు. వాళ్ల పేర్లు ఇక్కడ అప్రస్తుతం. తనకు మాత్రమే సాధ్యమైన జిమ్మిక్కులతో అరివీర భయంకరమైన ఎలివేషన్స్ ఇచ్చి, అటు సినిమా వాళ్లని మోసం చేశారు బాబు, ఇటు జనాల్ని కూడా బకరాల్ని చేశారు. బాబు కుర్చీ దిగాక కనీసం ఆ క్రియేటర్లలో ఏ ఒక్కరూ జగన్ దగ్గరకు రాకపోవడం విశేషం. 

బాబుతో రాసుకుపూసుకు తిరిగిన జనాలంతా, జగన్ సీఏం అయిన తర్వాత యాటిట్యూడ్ చూపించాడు. తమకు ఆస్తులు, షూటింగ్స్ అన్నీ హైదరాబాద్ లోనే అన్నట్టు వ్యవహరించారు. ఎప్పుడైతే ఏపీలో టికెట్ రేట్లు తగ్గించారో అప్పుడు టాలీవుడ్ లో ఉలికిపాటు మొదలైంది. కొంతమంది ఏపీ ప్రభుత్వానికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.

మొదటి రోజు నుంచి టాలీవుడ్ వ్యవహారశైలిని గమనిస్తూ వస్తున్న జగన్, తన మార్క్ ఎలా ఉంటుందో టాలీవుడ్ కు రుచిచూపించారు. అప్పటి ఆ నిర్లక్ష వైఖరికి ప్రతిఫలమే ఇప్పటి సవరణ చట్టం అంటున్నారు విశ్లేషకులు. జగన్ ఏదీ మరిచిపోరు. గుర్తుపెట్టుకొని మరీ తిరిగి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇండస్ట్రీకి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు.

సినిమా వాళ్లంతా హైదరాబాద్ లో స్థిరపడిపోయి.. పక్క రాష్ట్రం అంటూ ఏపీపై చిన్నచూపు చూస్తున్నారనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఈ విషయంలో జగన్ కి జై కొట్టనక్కర్లేదు కానీ, కనీసం తెలంగాణ ప్రభుత్వంతో కొనసాగిస్తున్న రిలేషన్ ని కూడా ఏపీలో జగన్ సర్కారుతో ఎందుకు మెయింటెన్ చేయరనేదే అసలు ప్రశ్న. 

పోనీ అన్ని సందర్భాల్లో అలానే ఉన్నారా అంటే అదీ లేదు. గతంలో బాబు అడుగులకు మడుగులొత్తారు, ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేశారు. ఇలాంటి వారందరికీ కొత్త సినిమా చట్టంతో స్క్రూ బిగించారు జగన్. ఓ విధంగా ఇది టాలీవుడ్ కు జగన్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు చాలామంది.