అమరావతి లో మాత్రమే రాజధాని ఉండాలనే డిమాండ్ తో న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ ఒక మహా పాదయాత్ర సాగుతూ ఉంది. ఇందులో అమరావతి ప్రాంతానికి చెందిన అనేకమంది పాల్గొంటున్నారు. ఈ యాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉంది. మామూలుగా డిసెంబరు 17 నాటికి తిరుమల చేరాలనే సంకల్పంతో బయలుదేరిన యాత్ర భారీ వర్షాల కారణంగా మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ సాగుతోంది.
అయితే యాత్ర చేస్తున్న వాళ్లంతా రైతులు, అచ్చంగా అమరావతికి పొలాలు ఇచ్చిన, త్యాగాలు చేసిన రైతులు అనే వాదన ఒకటి ఉంది. వారు తెలుగుదేశం కార్యకర్తలు/ అనుకూల వ్యక్తులు అని.. ఈ యాత్ర అనేదే తెలుగుదేశం పార్టీ స్పాన్సర్డ్ ప్రోగ్రాం అని మరో విమర్శ కూడా ఉంది.
దీనిమీద అధికార విపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయి. యాదృచ్ఛికమో నిజమో తెలియదు గానీ.. ఈ యాత్రలోని రైతులు తెలుగుదేశం వాళ్లే అనే వాదనకు బలం ఇచ్చే సంఘటన ఒకటి జరిగింది. విషయం ఏంటంటే..
యాత్రలోని రైతులంతా రెండు రోజుల కిందట నెల్లూరు సమీపానికి చేరుకున్నారు. సాధారణంగా వారు భారీ వర్షాలున్నప్పుడు విరామం తీసుకుంటున్నారు. వారి యాత్రలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. దారిపొడవునా వారికి విరాళాల వర్షం కురుస్తోంది కూడా. ఎక్కువగా వారికి మద్దతుగా యాత్రలో పాల్గొంటున్న వారు.. విరాళాలు ఇస్తున్న వారు అందరూ తెలుగుదేశం వారే అయి ఉండడం ఒక పార్శ్వం. అయితే రెండు రోజుల కిందట హఠాత్తుగా యాత్రకు విరామం ప్రకటించారు.
ఆరోజున వాతావరణం చాలా పొడిగా ఉంది. అలాగని మరీ ఎండ మండిపోయేలా కూడా లేదు. పాదయాత్రకు అనుకూలంగానే ఉంది. వర్షం లేదు. కానీ.. విరామం ఎందుకిచ్చారా? అనే సందేహం పలువురికి కలిగింది. ఆరా తీస్తే.. అసలు సంగతి బయట పడింది.
అదే రోజున వరద ప్రాంతాల పర్యటనలో ఉన్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లాకు వస్తున్నారు. ఆయన చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని నెల్లూరు జిల్లా లోని వరద బాధిత ప్రాంతాలలో పర్యటించే షెడ్యూలు ఉంది. మరి చంద్రబాబునాయుడు వస్తే.. ఆయన కార్యక్రమానికి జనసమీకరణ ఎలాగ?.
ఉన్న కార్యకర్తలంతా చంద్రబాబు కార్యక్రమానికి వెళ్లిపోతే.. ఇక మహా పాదయాత్ర మొహం చూసేదెవరు? అలాగని ఎవరూ రాకుండా మహాపాదయాత్ర వెలవెల పోయిందంటే.. అమరావతి అనే లక్ష్యానికి ప్రజాబలం లేదని అందరూ గుర్తిస్తారు కదా.. .! ఇన్ని రకాలుగా ఆలోచించి ఆరోజు ఏ అంతరాయమూ లేకపోయినప్పటికీ.. యాత్రకు విరామం ప్రకటించారు- యాత్రలోని చంద్ర భక్తులు!.
మరి ఇంత బహిరంగంగా వారి భక్తిని చాటుకుంటూ ఉంటే.. అమరావతి యాత్రలో ఉన్నదంతా అచ్చంగా రైతులే, తెలుగుదేశానికి సంబంధం లేదు.. అని ఎలా అనగలం?