గ‌వ‌ర్న‌ర్ పెద్ద‌రికం… ఊపిరి పీల్చుకున్న సీఎం!

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ప‌ట్టింపుల‌కు పోలేదు. కాస్త త‌గ్గి కేసీఆర్ స‌ర్కార్ మ‌నసును నొప్పించ‌కుండా న‌డుచుకున్నారు. బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభ ఉప‌న్యాసాన్ని గ‌వ‌ర్న‌ర్ ఏ విధంగా ఇస్తుందో అని కేసీఆర్ స‌ర్కార్ భ‌య‌పడింది. తాము…

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ప‌ట్టింపుల‌కు పోలేదు. కాస్త త‌గ్గి కేసీఆర్ స‌ర్కార్ మ‌నసును నొప్పించ‌కుండా న‌డుచుకున్నారు. బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభ ఉప‌న్యాసాన్ని గ‌వ‌ర్న‌ర్ ఏ విధంగా ఇస్తుందో అని కేసీఆర్ స‌ర్కార్ భ‌య‌పడింది. తాము ఇచ్చిన ప్ర‌సంగ పాఠాన్ని కాకుండా, తాను ప్ర‌త్యేకంగా తయారు చేసుకొచ్చి చ‌దువుతుందేమో అని బీఆర్ఎస్ నేత‌లు అనుమానించారు. దీంతో ఆమె ప్ర‌సంగ పాఠంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కున్న సంగ‌తి తెలిసిందే.

అయితే కేసీఆర్ స‌ర్కార్ భ‌య‌ప‌డ్డ‌ట్టు ఏమీ జ‌ర‌గ‌లేదు. త‌మిళిసై కూడా పెద్ద‌రికంతో వ్య‌వ‌హ‌రించారు. గ‌త ఏడాది గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ద‌ఫా కూడా అట్లే నిర్వ‌హించాల‌ని కేసీఆర్ స‌ర్కార్ మొద‌ట్లో నిర్ణ‌యించుకుంది. అయితే గ‌వ‌ర్న‌ర్ కూడా ఏ మాత్రం త‌గ్గ‌లేదు. దీంతో చిక్కుమ‌డి ప‌డింది. చివ‌రికి హైకోర్టు జోక్యం చేసుకోవ‌డం, ప్ర‌భుత్వం దిగిరాక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఎదురైంది.

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంతో బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభిస్తామ‌ని ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాది హామీ ఇవ్వ‌డంతో వివాదానికి తెర‌ప‌డింది. ప్ర‌భుత్వం త‌ర‌పున గ‌వ‌ర్న‌ర్‌ను ఆహ్వానించ‌డంతో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. ఇవాళ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి, ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంప్ర‌దాయాన్ని అనుస‌రించి గ‌వ‌ర్న‌ర్‌కు న‌మ‌స్క‌రించి మ‌రీ ఆహ్వానం ప‌లక‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వం ఇచ్చిన మ‌ర్యాద‌ను గ‌వ‌ర్న‌ర్ కాపాడుకున్నారు.

అనంత‌రం కాళోజీ మాట‌ల‌తో ప్ర‌సంగ పాఠాన్ని గ‌వ‌ర్న‌ర్ మొద‌లు పెట్టారు. కేసీఆర్ స‌ర్కార్ సాధించిన ప్ర‌గ‌తిని వివ‌రించారు. దేశానికే ఆద‌ర్శంగా తెలంగాణ నిలిచింద‌ని ఆమె ప్ర‌శంసించారు. కేసీఆర్ స‌ర్కార్ ప‌రిపాల‌న ద‌క్ష‌త‌, ప్ర‌జాప్ర‌తినిధుల కృషితో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకెళుతోంద‌ని చెప్పుకొచ్చారు.  ఇలా తెలంగాణ ప్ర‌భుత్వం వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని వివ‌రిస్తూ దాదాపు 40 నిమిషాలు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగించారు. చివ‌రికిగా ప్ర‌జాక‌వి దాశరథి గేయంతో ప్ర‌సంగాన్ని ముగించ‌డం విశేషం. వివాదాల‌కు చోటు లేకుండా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం కొన‌సాగ‌డంపై కేసీఆర్ స‌ర్కార్ హ్యాపీగా వుంది.