అక్కడ కట్ చెప్పాడు.. ఇక్కడ యాక్షన్ షురూ చేశాడు

ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ అయ్యారో, ఆ వెంటనే తన సినిమా షూటింగ్ కు ప్యాకప్ చెప్పేశాడు పవన్ కల్యాణ్. విజయవాడ వెళ్లి ఓ రేంజ్ లో హంగామా చేశారు. రోడ్డుపై పడుకొని స్టిల్స్ ఇచ్చారు,…

ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ అయ్యారో, ఆ వెంటనే తన సినిమా షూటింగ్ కు ప్యాకప్ చెప్పేశాడు పవన్ కల్యాణ్. విజయవాడ వెళ్లి ఓ రేంజ్ లో హంగామా చేశారు. రోడ్డుపై పడుకొని స్టిల్స్ ఇచ్చారు, కూర్చొని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి ఆవేశంగా డైలాగ్స్ చెప్పారు. అలా 2 రోజుల పాటు చంద్రబాబుపై తన ప్రేమను చాటుకున్న పవన్, ఆ 'పొలిటికల్ షెడ్యూల్'కు ప్యాకప్ చెప్పేశాడు.

అవును.. చంద్రబాబు ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పెట్టేశాడు పవన్ కల్యాణ్. ఎంచక్కా వెళ్లి మళ్లీ సినిమా సెట్స్ లో వాలిపోయారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షెడ్యూల్ ను కొనసాగిస్తున్నాడు పవన్. ప్రస్తుతం ఈ హీరోపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఆనంద్ సాయి వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ షూట్ నడుస్తోంది.

లాంగ్ గ్యాప్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశాడు పవన్. దీంతో దర్శకుడు హరీశ్ శంకర్ ఊపిరి పీల్చుకున్నాడు. అంతలోనే చంద్రబాబు అరెస్ట్ తో పవన్, షూటింగ్ కు దూరమయ్యాడు. దీంతో హరీశ్ తో పాటు నిర్మాతల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. అయితే అలా వెళ్లిన 2 రోజులకే తిరిగి పవన్ సెట్స్ పైకి రావడంతో యూనిట్ మరోసారి ఊపిరి పీల్చుకుంది.

పవన్ మళ్లీ సినిమాల్లోకి రావడంతో, అటు ఓజీ, హరిహర వీరమల్లు సినిమా యూనిట్లు కూడా ఖుషీగా ఉన్నాయి. అయితే పవన్ ఎన్నాళ్లిలా మళ్లీ షూటింగ్స్ మూడ్ లో ఉంటారనేది పెద్ద ప్రశ్న.

చాలామంది ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే, పవన్ మరోసారి పొలిటికల్ గా బిజీ అవుతారని, మంగళగిరి వెళ్తారని అంటున్నారు. అదే నిజమైతే, ఓజీ యూనిట్ కు తలనొప్పులే. మరికొంతమంది మాత్రం ఈ నెలంతా పవన్ షూటింగ్స్ లో ఉంటారని చెబుతున్నారు.