బాబుతో ఆ ముగ్గురు కాసేప‌ట్లో…!

స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్ర‌బాబు ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో రాజ‌మండ్రి కేంద్రంగా టీడీపీ రాజ‌కీయం న‌డుస్తోంది. టీడీపీ ముఖ్య నేత‌లంతా రాజ‌మండ్రికి క్యూ క‌డుతున్నారు. వారంలో…

స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్ర‌బాబు ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో రాజ‌మండ్రి కేంద్రంగా టీడీపీ రాజ‌కీయం న‌డుస్తోంది. టీడీపీ ముఖ్య నేత‌లంతా రాజ‌మండ్రికి క్యూ క‌డుతున్నారు. వారంలో రెండు రోజులు మాత్ర‌మే చంద్ర‌బాబుతో ములాఖ‌త్ అయ్యే అవ‌కాశం వుంది. దీంతో ఆ స‌మ‌యాన్ని కుటుంబ స‌భ్యులు వాడుకుంటున్నారు.

రెండు రోజులుగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో వుంటున్న చంద్ర‌బాబును ఇవాళ ఆయ‌న కుటుంబ స‌భ్యులు క‌లుసుకోనున్నారు. మంగ‌ళ‌వారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు చంద్ర‌బాబును క‌లుసుకునేందుకు ఆయ‌న కుటుంబ స‌భ్యులు రాజ‌మండ్రికి చేరుకున్నారు. చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి, కోడ‌లు బ్రాహ్మ‌ణి, బాల‌కృష్ణ చిన్న కుమార్తె తేజ‌శ్విని, ఆమె భ‌ర్త భ‌ర‌త్ త‌దిత‌రులు రాజ‌మండ్రికి వెళ్లారు.

ములాఖ‌త్‌లో మాత్రం బాబును ముగ్గురు కుటుంబ స‌భ్యులు భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణి, లోకేశ్ క‌ల‌వ‌నున్నారు. లోకేశ్ పాద‌యాత్ర ఇప్ప‌టికే రాజ‌మండ్రి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. బాబు అరెస్ట్‌తో ఆయ‌న పాద‌యాత్ర అర్ధంత‌రంగా ఆగిపోయింది. టీడీపీలో నెల‌కున్న సంక్షోభం బాబు బెయిల్‌పై రాక‌తో చ‌క్క‌బ‌డే అవ‌కాశాలున్నాయి. ఆ త‌ర్వాత లోకేశ్ పాద‌యాత్ర‌ను ప్రారంభించనున్నారు. 

అంత వ‌ర‌కూ రాజ‌మండ్రి కేంద్రంగా లోకేశ్ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై పార్టీ ముఖ్య నేత‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించ‌నున్నారు. కాసేప‌ట్లో తండ్రిని క‌లిసి బ‌య‌ట జ‌రుగుతున్న ప‌రిస్థితుల గురించి వివ‌రించే అవ‌కాశం వుంది.