షాదర్ నగర్ వద్ద వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి పై జరిగిన ఘాతుకంలో నిందితులను పోలీసులు తొందరగానే గుర్తించి పట్టుకున్నారు. మన పోలీసులు ఘాతుకాలు జరగక ముందు వాటిని నివరించడంలో విఫలం అవుతున్నా, కనీసం నిందితులను అయితే మాత్రం తొందరగా పట్టుకున్నారు. ఈ ఘాతుకం జరిగింది హైవే పక్కనే. అది కూడా లారీ డ్రైవర్ల మీద మొదటి నుంచి అనుమానాలున్నాయి.
హై వే మీద ఏ దుర్మార్గులు ఈ పని చేసి పోయారో గుర్తించడం కష్టమే. అయితే నిందితులు ఆ చుట్టుపక్కలే సంచరించడం, ప్రియాంక ను దారుణంగా సజీవ దహనం చేయడం.. వారిని పట్టించింది. ఈ విషయంలో ఒక పెట్రోల్ బంక్ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది.
రెడ్ కలర్ స్కూటర్ పై ఇద్దరు వ్యక్తులు వచ్చి, ఖాళీ సీసాలో పెట్రోల్ అడిగారని.. వారి వాలకం చూసి తను వారికి పెట్రోల్ వేయలేదని.. ఘాతుకం జరిగిన సమీపంలోని ఒక పెట్రోల్ బంక్ లోని వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. ప్రియాంకపై ఆ నలుగురి దుర్మార్గం జరిగిన తర్వాత పోలీసుల విచారణకు ఆ పెట్రోల్ బంక్ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఎంతో ఉపయోగపడింది. వారిని గుర్తించడానికి ఆ సమాచారం ఉపయోగపడింది.
అలా ఒక పెట్రోల్ బంక్ లో ఖాళీ బాటిల్ లోకి పెట్రోల్ పోయకపోయినా ఆ దుర్మార్గులు వెనక్కు తగ్గలేదు. మరో పెట్రోల్ బంక్ లోకి వెళ్లి పెట్రోల్ తీసుకున్నారు. ఖాళీ సీసాలోకే పెట్రోల్ తీసుకొన్నట్టుగా తెలుస్తోంది. అలా ప్రియాంకపై దారుణానికి తెగబడిన వాళ్లకు పెట్రోల్ ఇచ్చిన బంక్ పై చట్టపరమైన చర్యలకు పోలీసులు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది.