మోడీ ప్రియతముడికే పీట వేస్తారా?

తెలంగాణ భారతీయ జనతా పార్టీ కొత్త సారధి నియామకానికి ఇప్పుడు కసరత్తు జరుగుతోంది. తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటున్న వేళ.. పార్టీ అధ్యక్ష స్థానం కీలకంగా మారుతోంది. Advertisement తెరాసను ఎదుర్కోవడంలో.. కాంగ్రెస్…

తెలంగాణ భారతీయ జనతా పార్టీ కొత్త సారధి నియామకానికి ఇప్పుడు కసరత్తు జరుగుతోంది. తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటున్న వేళ.. పార్టీ అధ్యక్ష స్థానం కీలకంగా మారుతోంది.

తెరాసను ఎదుర్కోవడంలో.. కాంగ్రెస్ కూడా విఫలం అవుతున్న నేపథ్యంలో.. భాజపా బలం పుంజుకోవడానికి ఇదే తరుణమని భావిస్తోంది. అధ్యక్షపీఠంపై ఎందరికి ఆశలున్నప్పటికీ… ప్రధాని నరేంద్రమోడీ ప్రియతముడైన నాయకుడికే పెద్దపీట వేయవచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి.

తెలంగాణ భాజపా అధ్యక్ష స్థానం స్వీకరించడానికి ఇప్పుడు పలువురు నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే.. ఇప్పుడు పార్టీ పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నందున.. పార్టీని మరింత బలోపేతం చేసుకోగలమనే ఆశ ఉంది. ఏదైనా మ్యాజిక్ జరిగితే అధికారంలోకి వస్తామనే ఆశ కూడా ఉంది. అలాంటి నేపథ్యంలో ఎక్కువ మంది పదవికోసం పాకులాడడం మామూలే.

వీరిలో ప్రస్తుతం పార్టీ సారధిగా ఉన్న లక్ష్మణ్‌తోపాటు, మురళీధర్ రావు, డికె అరుణ, జితేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. లక్ష్మణ్ పార్టీ సారధిగా ఉన్నారు. మరోసారి పదవి కొనసాగింపు కోరుకుంటున్నారు.

నాయకుల బలాబలాలతో పాటు పార్టీ కులాల సమీకరణలను కూడా పరిశీలిస్తోంది. లక్ష్మణ్ బీసీ నాయకుడు. మురళీధర్ రావుకు కేటాయిస్తే.. కేసీఆర్ వర్గానికే భాజపా సారథ్యం కూడా దక్కినట్టు అవుతుంది. మరోవైపు డికె అరుణ, జితేందర్ రెడ్డి ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో లాబీయింగ్ చేసుకుంటూ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఈ నాయకుల్లో జితేందర్ రెడ్డికి ప్రధాని మోడీతో కొన్ని దశాబ్దాల కిందటినుంచి సన్నిహిత పరిచయం ఉంది. మోడీ ప్రచారక్‌గా ఉన్న రోజుల్లోనే.. జితేందర్ రెడ్డి భాజపాలో ఉన్నారు. అప్పట్లో మోడీకి అనేక రకాలుగా జితేందర్ రెడ్డి అండదండలుగా ఉండేవారనే పేరుంది. ఆ రకంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది.

జితేందర్ రెడ్డికి పదవి అనేది సామాజిక వర్గాల పరంగా కూడా కలిసి వచ్చే అంశం కావడంతో.. ఆయనకే మొగ్గు ఎక్కువగా ఉన్నదని పరిశీలకులు భావిస్తున్నారు.