రాష్ట్ర్రంలో రాజకీయ వలసలు జోరుగా సాగుతున్నాయి. తమ రాజకీయ భవిష్యత్ కోసం టీడీపీ నుంచి కొందరు బీజేపీలోకి, కొందరు వైసీపీలోకి పరుగులు పెడుతున్నారు. అయితే వీరిని స్పష్టంగా రెండు కేటగిరీలుగా విభజించవచ్చు. అవినీతిపరులు, కేసుల్లో ఇరుక్కుపోయినవారు వెంటనే కాషాయం కండువా కప్పేసుకుంటున్నారు. బాబు బాధితులు మాత్రం వైసీపీ శిబిరానికి క్యూ కడుతున్నారు.
బీజేపీలోకి వెళ్లిన-వెళ్తున్న వారెవరూ బాబుపై పల్లెత్తు మాట అనకపోవడం, టీడీపీ తరపు నుంచి కూడా ఆ బ్యాచ్ పై విమర్శలు వినిపించకపోవడం ఇక్కడ విచిత్రం. ఇక వైసీపీలోకి వెళ్తున్నారని తెలిసినా, వెళ్లినా సోషల్ మీడియాలో వారంతా టార్గెట్ అవుతుంటారు. పచ్చ నేతలు కూడా వీరిని విడిచిపెట్టరు. ప్రస్తుతం ఇదీ రాష్ట్రంలో జరుగుతున్న వలసల విభజన రాజకీయం.
కేసుల భయంతో నలుగురు రాజ్యసభ సభ్యులు ఆదిలోనే బీజేపీలోకి వెళ్లారు, ఆ తర్వాత ఈడీ కేసులతో జైలుకి వెళ్లొచ్చిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి.. ఇలా బైటకొచ్చి, అలా బీజేపీ కండువా కప్పుకుని పునీతులయ్యారు. ఇక విశాఖ భూ కుంభకోణానికి ప్రధాన కారణమైన గంటా, బీజేపీ వైపే చూస్తున్నారనేది బహిరంగ రహస్యం.
ఇటు రాయలసీమ నుంచి జేసీ దివాకర్ రెడ్డి, ట్రావెల్స్ అవినీతి పెరిగిపోయి భయపడిపోతున్నారు. వీలైనంత త్వరగా కమలదళంలో కలసిపోబోతున్నారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిది కూడా ఇదే బాట. కేసుల భయంతో భూమా అఖిల ప్రియ కూడా బీజేపీవైపే చూస్తోందని సమాచారం. ఒకరేంటి.. అవినీతి బ్యాచ్ అంతా బీజేపీ వైపే చూస్తోంది.
విచిత్రంగా దీనికి రివర్స్ లో బాబు బాధితులు వైసీపీ పంచన చేరుతున్నారు. జూపూడి ప్రభాకర్, కారెం శివాజీని సామాజిక వర్గం పేరు చెప్పి చంద్రబాబు వాడుకుని మోసం చేశారు. జూపూడిని అయితే కేవలం జగన్ ని తిట్టడం కోసమే వాడుకున్నారు. ఇలాంటి బాధితులంతా ఇప్పుడు జగన్ పక్కన చేరిపోయారు. వల్లభనేని వంశీది కూడా ఇదే పరిస్థితి. ఓ దశలో వంశీ టికెట్ కూడా గందరగోళంలో పడింది. చంద్రబాబు తనని మోసం చేశారని తెలుసుకునే వంశీ జగన్ టీమ్ లో చేరబోతున్నారు.
ఇక దేవినేని అవినాష్ ని చంద్రబాబు ఎంత దారుణంగా మోసం చేసిందీ మంత్రి కొడాలి నాని ఇప్పటికే స్పష్టంగా వివరించారు. టీడీపీ ఓడిపోయే సీటు అని తెలిసి కూడా గుడివాడలో అవినాష్ చేత భారీగా ఖర్చు పెట్టించారు బాబు. ఇలా బాబు బాధితులంతా కూడబలుక్కున్నట్టు వైసీపీ వైపు వస్తుంటే.. టీడీపీ హయాంలో అవినీతి సామంతులంతా బీజేపీలో చేరుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ వలసల్లో ఈ విభజన స్పష్టంగా కనపడుతోంది.