పవన్ కల్యాణ్ పర్యటనకు వస్తే స్థానిక అభిమానులకు పండగో కాదో కానీ, లోకల్ దొంగ బ్యాచ్ కి మాత్రం అదో పెద్ద పండగ. ఏడాదంతా చేసే పని వేరు, ఆ ఒక్కరోజు చేసే పనివేరు. ప్రస్తుతం పవన్ ని నమ్ముకునే వీరంతా సంతోషంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. సామూహిక సెల్ ఫోన్ చోరీలకు పవన్ టూర్ నే ముహూర్తంగా పెట్టుకున్నారు.
తాజాగా పవన్ కల్యాణ్ రాయలసీమ పర్యటన కోసం నిన్న మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో దిగారు. మహా అయితే 250 మంది అభిమానులు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చి పవన్ కి స్వాగతం పలికారు. తీరా జనసేనాని అక్కడినుంచి వెళ్లిపోయాక వీరిలో 25మంది సెల్ ఫోన్లు మిస్సయ్యాయి. లబోదిబోమంటూ అభిమానులంతా పోలీసుల దగ్గరకి పరిగెత్తారు.
రేణిగుంటలోనే కాదు, విశాఖ ఇసుక ధర్నాలో, ఎలక్షన్ల ముందు పవన్ చేసిన పలు నిరసన ప్రదర్శనల్లో కూడా ఇదే తంతు. సెల్ ఫోన్ లు చోరీ చేసే బ్యాచ్ కేవలం పవన్ టూర్ రోజే చెలరేగిపోతోంది. ఇంతవరకూ రికవరీ జరిగిన దాఖలాలు మాత్రం లేవు. రేణిగుంటలో ఓ వైపు బాధితులు మీడియాకు మొరపెట్టుకుంటుంటే, మరోవైపు కొంతమంది జనసైనికులు.. తమపై నిందలేస్తే ఊరుకునేది లేదని ఎదురుతిరిగారు.
జనసైనికులెవరూ ఇలాంటి వాటిని ప్రోత్సహించరని, దొంగల పని పట్టాల్సిన బాధ్యత పోలీసులదేనంటూ సెలవిచ్చారు. పవన్ కల్యాణ్ ని చూడగానే అభిమానులు అదో ట్రాన్స్ లోకి వెళ్తుంటారు. జై జనసేనాని అంటూ ఎగబడుతుంటారు. సరిగ్గా ఇక్కడే దొంగలకు పని ఈజీ అయిపోతోంది.
రాష్ట్రంలో మరే ఇతర రాజకీయ నాయకుడి సభలు, ర్యాలీలలోనూ ఈ స్థాయిలో సెల్ ఫోన్లు చోరీ అయిన ఉదాహరణలు లేవు. పవన్ కల్యాణ్ ని చూడడం కోసం వచ్చేవారంతా యూత్, వారందరి దగ్గర మినిమమ్ 10వేలు ఖరీదు చేసే స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. సో.. ఈ బ్యాచ్ ని టార్గెట్ చేసుకుంటే సులువుగా పని అవుతుందని, కేవలం పవన్ టూర్లపైనే దృష్టిపెట్టాయి లోకల్ దొంగ బ్యాచ్ లు. పవన్ ఎక్కడికి వస్తే అ క్కడ వాలిపోతున్నాయి. పవన్ వస్తున్నారంటే చాలు, వీరికి పండగే.