టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఎందుకనో ఎన్టీఆర్ అనే పేరు అసలు గిట్టడం లేదు. దివంగత ఎన్టీఆర్‌కు తాను పొడిచిన వెన్నుపోటుకు ఎప్పటికైనా భారీ మూల్యం చెల్లించాల్సి వుంటుందనే అనుమానం చంద్రబాబును నీడలా వెంటాడుతున్నట్టుంది. సీనియర్ ఎన్టీఆర్‌తో పాటు తన తండ్రి హరికృష్ణకు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని యువ హీరో, నందమూరి వారసుడిగా గుర్తింపు పొందిన ఒకే ఒక్కడు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ మరిచిపోరనే ప్రచారం జరుగుతోంది.
వెన్నుపోటు సినిమాలో హీరో జూనియర్ ఎన్టీఆర్ అయితే, విలన్ ఎవరో లోకానికి బాగా తెలుసు. మరీ ముఖ్యంగా నందమూరి కుటుంబానికి కసి తీరా ద్రోహం చేసిన ఆ సీనియర్ నాయకుడికి ఎంతో బాగా తెలుసని, అందుకే భయపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ను టీడీపీకి దూరం చేయాలనే కుట్రలకు తెరలేపారని ఆయన అభిమానులు పసిగట్టారు. ఇందులో భాగంగా నారా భువనేశ్వరిపై వైసీపీ నేతల దూషణలను ఆయుధంగా మలుచుకున్నట్టు ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు.
చంద్రబాబు వయసు పైబడడం, మరోవైపు ఆయన తనయుడు లోకేశ్ నాయకుడిగా కేడర్‌గా భరోసా కల్పించడంలో విఫలం కావడంతో… సహజంగానే అందరి చూపు ఎన్టీఆర్‌పై పడింది. గతంలో చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్లినప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకురావాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య, ఇతర నాయకులు కూడా ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకురావాలని బహిరంగంగానే డిమాండ్ చేస్తుండడం ఇటీవల కాలంలో చూశాం.
ఈ డిమాండ్లపై ఉపేక్షిస్తే లోకేశ్ భవిష్యత్ గోవిందా అని చంద్రబాబునాయుడు, మరికొందరు భాయందోళనలో ఉన్నారు. దీంతో మంచైనా, చెడైనా లోకేశ్ నాయకత్వమే కొనసాగాలనే ఎత్తుగడలో భాగంగా, జూనియర్ ఎన్టీఆర్‌పై పసుపు సైన్యంలో వ్యతిరేకత నింపేందుకు టీడీపీ సరికొత్త కుట్రకు తెరలేపింది. ఇందులో భాగంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆయన అభిమానులు అనుమానిస్తున్నారు.
నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య అభిప్రాయపడడం వరకే పరిమితం కాలేదు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్ విఫలమయ్యారని విమర్శించారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలను వదులుకుంటారా? అని ఎన్టీఆర్‌ను వర్ల రామయ్య నిలదీయడం వెనుక బలమైన వ్యూహం ఉందని యువ హీరో అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఎన్టీఆర్‌కు నందమూరి, టీడీపీ కుటుంబానికి ఇకపై సంబంధాలు లేవని వర్ల రామయ్య పరోక్షంగా చెప్పకనే చెప్పారని రాజకీయ, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్‌కు నైతిక విలువలు లేవని కూడా టీడీపీ నేతలు ప్రచారం చేయడం వెనుక దురుద్దేశాన్ని పసిగట్టలేని దుస్థితిలో తమ హీరో లేరని ఆయన అభిమానులు అంటున్నారు. ఓ పథకం ప్రకారం ఎన్టీఆర్‌పై టీడీపీ చేస్తున్న దాడి …మున్ముందు ఆయనకు, పార్టీకి సంబంధం లేదనే వరకూ సాగుతుందని ఓ అంచనా. చూద్దాం కాలం ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో!