టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అఖిలప్రియను టీడీపీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఆమె ఉనికి చాటుకునేందుకు నోటికొచ్చిందేదో మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆళ్లగడ్డలో కార్యకర్తల సమావేశంలో అఖిలప్రియ మాట్లాడుతూ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో చిన్న సంఘటన జరిగినా టీడీపీ అగ్రనేతలంతా వెళుతున్నారని, కానీ తమ దగ్గర కేసులు పెట్టి అరెస్ట్లు చేస్తున్నా కనీసం తొంగి చూడడం లేదని ఆగ్రహాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆమె మాటల్ని టీడీపీ నేతలు లైట్ తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో మీడియా అటెన్షన్ కోసం నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డిపై సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. నంద్యాల ఎమ్మెల్యే చూపు టీడీపీ వైపు వుందని హాట్ కామెంట్స్ చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు వెళుతున్న నేపథ్యంలో, అలాంటి ఆరోపణలు చేసినా నమ్ముతారని ఆమె నమ్ముతున్నట్టున్నారు. నంద్యాలలో జోక్యం చేసుకోవద్దని ఆమెకు టీడీపీ పెద్దలు పదేపదే చెప్పినా బేఖాతరు చేయడం వెనుక పెద్ద కథే వుందనే చర్చ జరుగుతోంది.
నంద్యాలను వదిలేసి…. ఆళ్లగడ్డ టికెట్ నీకే, వెళ్లి బాగా చేసుకో అని చంద్రబాబు, లోకేశ్ చెబుతారనే ఆశతోనే, పక్క నియోజక వర్గ రాజకీయాల్లో ఆమె జోక్యం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే అఖిలప్రియ వ్యూహాన్ని పసిగట్టిన టీడీపీ అధిష్టానం… ఆమె ఆశించినట్టుగా ఏమీ చెప్పడం లేదు. అఖిలప్రియను ఎలా బయటికి పంపాలనే వ్యూహ రచనలో టీడీపీ వుందనేది బహిరంగ రహస్యమే.
భూమా కుటుంబానికి చెందిన మరో నాయకుడిని ఆళ్లగడ్డలో నిలబెట్టేందుకు టీడీపీ పక్కా ప్రణాళికతో ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో దిక్కుతోచని అఖిలప్రియ నంద్యాల ఎమ్మెల్యే తమ పార్టీలోకి వస్తాడని ఆరోపించడం అంటే కామెడీ కాకుండా మరేం అవుతుందని నెటిజన్లు వెటకరిస్తున్నారు. టీడీపీ నాయకులతో శిల్పా రవి టచ్లో ఉన్నారని తనకు తెలిసిందన్నారు. టీడీపీలో చేరేందుకు శిల్పా రవి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారని అఖిలప్రియ ఆరోపించడం హాస్యాస్పదమని నెటిజన్లు అంటున్నారు.
ఆళ్లగడ్డ, నంద్యాలలో ఎటూ తనకు టీడీపీ టికెట్ ఇవ్వరని, కనీసం వైసీపీ ఎమ్మెల్యే అటు వెళితే, ఆ సీటు తనకు ఇస్తారనే ఆశ కాబోలు, అఖిలప్రియ పొంతన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు సెటైర్లు విసురుతున్నారు. అఖిలప్రియను పట్టించుకోకుండా, ఇలాగే వదిలేస్తే… రేపు వైసీపీలో లోకేశ్ చేరుతారని తనకు సమాచారం అందిందని ఆరోపించినా ఆశ్చర్యపోనవడసరం లేదని నెటిజన్లు సెటైర్ వేస్తున్నారు.