ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆవేశం వచ్చినా, ఆగ్రహం వచ్చినా ఎవరూ తట్టుకోలేరు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన వాడని ఆయన నమ్మారు. మంత్రి పదవి తప్ప, మిగతా అన్ని రకాలుగా ఆయనకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ కోటంరెడ్డి అత్యాశకు పోయారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను విస్మరించి, తనకే అగ్రస్థానం ఇవ్వాలని కోరుకున్నారు. కోటంరెడ్డి ఆశించిన దానికి భిన్నంగా చకచకా అన్నీ జరిగిపోయాయి.
కోటంరెడ్డిని ఓడించేందుకు బలమైన అభ్యర్థిని ముఖ్యమంత్రి ఖరారు చేశారు. నెల్లూరు రూరల్ సమన్వయకర్తగా ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేరును సజ్జల రామకృష్ణారెడ్డి అధికారికంగా ప్రకటించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆదాలను ఎంపిక చేసినట్టు ఆయన అన్నారు. అలాగే 2024 ఎన్నికల్లో ఆదాల నెల్లూరు రూరల్ నుంచి బరిలో నిలుస్తారని స్పష్టం చేయడం విశేషం. కోటంరెడ్డి చేజేతులా బలమైన ప్రత్యర్థిని కొని తెచ్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల్లో ఆదాలను ఎదుర్కోవడం అంత సులువు కాదు. రాజకీయాల్లో ఆదాల సీనియర్ నాయకుడు. మంత్రిగా కూడా పని చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి లాంటి సీనియర్ నేతను ఓడించిన చరిత్ర ఆదాలది. ఆర్థికంగా స్థితిమంతుడు. వివాద రహితుడు. అందరితో సఖ్యతగా వెళ్లే నాయకుడిగా ఆయనకు గుర్తింపు, గౌరవం ఉన్నాయి. తనపై సీఎం జగన్ ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని ఆదాల ప్రకటించారు.
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీలోకి వెళ్లినంత మాత్రాన వైసీపీకి వచ్చిన నష్టం లేదని ఆయన తేల్చి చెప్పారు. టీడీపీలో కోటంరెడ్డి బాధితులు చాలా మంది ఉన్నారని, వారంతా తమ వైపు తప్పక వస్తారని అన్నారు. ఇకపై నెల్లూరు రూరల్‌లో వైసీపీ కార్యకలాపాలన్నీ ఆదాల చేతుల మీదుగానే జరుగుతాయని ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్‌లో రానున్న రోజుల్లో బిగ్ ఫైట్ తప్పదు.