మరికొన్ని రోజుల్లో కియరా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి చేసుకోబోతున్నారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో వీళ్ల పెళ్లి జరుగుతుంది. పెళ్లికి సంబంధించి నగరంలోని ఓ విలాసవంతమైన హోటల్ రిసార్ట్ ను వీళ్లు బుక్ చేశారు. కేవలం కొన్ని గదులు మాత్రం కాదు, ఏకంగా హోటల్ మొత్తాన్ని వీళ్లు బుక్ చేశారు. అది కూడా 3 రోజుల పాటు.
6వ తేదీన కియరా పెళ్లి చేసుకోబోతోంది. 4వ తేదీ నుంచి ప్రీ-వెడ్డింగ్ సంబరాలు మొదలుకాబోతున్నాయి. దీనికోసం హోటల్ లోని గదులన్నింటినీ 3 రోజుల పాటు బుక్ చేసేసింది ఈ జంట. ఈ ఫైవ్ స్టార్ హోటల్ లగ్జరీ రిసార్ట్ లో వివిధ కేటగిరీల్లో గదులున్నాయి. పెవిలియన్ రూమ్, హెరిటేజ్ రూమ్, సిగ్నేచర్ సూట్, లగ్జరీ సూట్.. ఇలా వివిధ విభాగాల్లో రూమ్స్ అందుబాటులో ఉన్నాయి.
వీటి ధరలు ఒక్క రాత్రికి 24వేల రూపాయల నుంచి 76వేల రూపాయల మధ్యలో ఉన్నాయి. ఇక అత్యంత ఖరీదైన ధార్ హవేలీ సూట్ లో ఉండాలంటే ఒక రాత్రికి లక్షా 30వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూమ్స్ అన్నింటినీ కియరా-సిద్దార్థ్ 3 రోజుల పాటు బుక్ చేసేశారు.
ఈ పెళ్లికి 100 నుంచి 125 మంది అతిథుల్ని ఆహ్వానించింది ఈ జంట. వీళ్లలో స్నేహితులు, బంధువులే ఎక్కువగా ఉన్నారు. బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్ లాంటి అతికొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఉన్నారు. వీళ్లందర్నీ ఎయిర్ పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకునేందుకు 70 లగ్జరీ కార్లను కూడా ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు ఈ కార్లు సదరు అతిథులకు అందుబాటులో ఉంటాయి.
పెళ్లి కోసం ఇప్పటికే రిసార్ట్ మొత్తం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. కాబోయే వధూవరులిద్దరూ రేపు సాయంత్రానికే హోటల్ కు చేరుకుంటారు. హల్దీ ఫంక్షన్ తో కియరా పెళ్లి వేడుక మొదలుకానుంది. ఈ పెళ్లి తంతు ముగిసిన వెంటనే తిరిగి రామ్ చరణ్-శంకర్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతుంది కియరా.