కొన్ని నెలల కిందటి సంగతి.. దర్శకుడు మోహన్ రాజాతో ఓ సినిమా ప్లాన్ చేశాడు నాగార్జున. తన ల్యాండ్ మార్క్ మూవీగా దాన్ని ప్రజెంట్ చేయాలనుకున్నాడు. ఈ విషయాన్ని మోహన్ రాజా కూడా అప్పట్లో కన్ ఫర్మ్ చేశాడు కూడా. కట్ చేస్తే, మధ్యలోకి చిరంజీవి వచ్చారు. తన గాడ్ ఫాదర్ కోసం మోహన్ రాజాను మెగా కాంపౌండ్ లోకి లాక్కొచ్చారు
ఇప్పుడు మరోసారి అదే సీన్ రిపీట్ కాబోతోందా? అవుననే అంటున్నారు చాలామంది జనం. ఈసారి త్రినాధరావు నక్కిన వంతు వచ్చింది.
హిట్ కాంబో లేకుండా ఎలా..?
ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు నక్కిన. దీంతో ఏకంగా మెగా ఆఫర్ అందుకున్నాడు. మంచి స్టోరీ సెట్ అయితే సినిమా చేద్దామంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు చిరు. చెప్పినట్టుగానే త్రినాధరావు చెప్పిన లైన్ కూడా విన్నారు, ఓకే చెప్పారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే డీవీవీ బ్యానర్ పై ఈ సినిమా వస్తుంది.
ఇంతవరకు బాగానే ఉంది. అసలు కథ ఇక్కడే మొదలైంది. ఇన్నాళ్లూ త్రినాధరావుతో జర్నీచేసిన బెజవాడ ప్రసన్నకుమార్ ఇప్పుడు ఆయనతో లేరు. త్రినాధరావు చేసిన ప్రతి సినిమాకు ఇప్పటివరకు కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్ అన్నీ ఈయనే. ఇలాంటి కీలకమైన వ్యక్తి ఇప్పుడు నాగార్జున వైపు వెళ్లారు.
నాగార్జునతో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రసన్నకుమార్. ఈ మూవీతో ఆయన దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. కాబట్టి నాగ్ సినిమా ప్రసన్నకుమార్ కు చాలా కీలకం. ఇలాంటి టైమ్ లో త్రినాధరావుకు చిరంజీవి ఆఫర్ ఇచ్చారు.
మరి చిరంజీవి సినిమా కోసం త్రినాధరావు-బెజవాడ ప్రసన్నకుమార్ కలిసి పనిచేస్తారా? లేక మరో రచయితతో త్రినాధరావు చిరంజీవి సినిమా వర్క్ స్టార్ట్ చేస్తాడా? అసలు ప్రసన్నకుమార్ ప్రాజెక్టులో లేకపోతే చిరంజీవి ఓకే చెబుతారా? ఇలా ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు.
దీంతో ఇప్పుడు మరోసారి చిరు-నాగ్ పంచాయితీ మొదలయ్యేలా ఉంది. తన సినిమా కోసం గతంలో మోహన్ రాజాను లాక్కొచ్చినట్టు, ఈసారి ప్రసన్నకుమార్ ను కూడా చిరంజీవి తనవైపు తీసుకొస్తారేమో చూడాలి. అయితే అప్పుడు ఒప్పుకున్న నాగార్జున, ఇప్పుడు అంగీకరిస్తారా అనేది కూడా ప్రశ్నార్థకం. ఎందుకంటే, ప్రసన్నకుమార్ తో నాగ్ చేస్తున్న సినిమా ప్రతిష్టాత్మక 99వ ప్రాజెక్టు.
ఈ మొత్తం వ్యవహారంపై మరో వాదన కూడా వినిపిస్తోంది. చిరంజీవి సినిమా పనులు మొదలయ్యేసరికి, నాగ్ తో సినిమాను ప్రసన్నకుమార్ పూర్తిచేస్తాడంటున్నారు చాలామంది. రీమేక్ ప్రాజెక్టు కాబట్టి తొందరగానే షూటింగ్ పూర్తవుతుందని, ఆ వెంటనే త్రినాధరావు-ప్రసన్నకుమార్ కలిసి చిరు ప్రాజెక్టుపై వర్క్ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. ఈ పంచాయితీ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.