ఉత్తరాంధ్రాలో అనేక కీలక ప్రాజెక్టుల విషయం కేంద్ర బడ్జెట్ అసలు ఏమాత్రం పట్టించుకోనట్లే కనిపిస్తోంది. విశాఖ రైల్వే జోన్ ని పూర్తిగా మరచిపోయింది. ఏమైనా అంటే పూర్తి చేస్తామని చెబుతోంది తప్ప నిధుల కేటాయింపు అన్నది లేకుండా పోతోంది.
విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మించాలన్నది విభజన చట్టంలో ఉంది. తొమ్మిదేళ్ళు పూర్తి కావస్తోంది గట్టిగా వంద కోట్ల నిధులు అయినా ఇప్పటికి జమ కాలేదు. గత నాలుగేళ్ళుగా చూసే 22 కోట్ల వంతున నిధులు విదిలించారు. ఇపుడు అదీ ఎందుకు అనుకున్నారేమో తాజా బడ్జెట్ లో నిర్మలమ్మ 18 కోట్లకే పరిమితం చేశారు.
ఈ బడ్జెట్ ఉద్యోగుల జీతాలు ఇతర ఖర్చులకే సరిపోవడంలేదు. గిరిజన విశ్వవిద్యాలయం అన్ని హంగులతో నిర్మించాలంటే 1200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్కలు ఉన్నాయి. ఇలా విదిలింపులతో సరిపెడుతూంటే ఎప్పటికి పూర్తి అయ్యేను అన్నదే జనం మాట.
భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కి కేంద్రం నిధులు ఇవ్వాలన్న సంగతి మరచిపోయింది అని తాజా బడ్జెట్ నిరూపిస్తోంది. మూడు వేల కోట్ల రూపాయలు దాకా ఈ ఎయిర్ పోర్టు కి ఖర్చు అవుతుంది. కానీ పైసా అయితే విద్లించిన పాపాన పోలేదు. విజయనగరం జిల్లాలో కొత్తగా మెడికల్ కాలేజి కి నిధులను ఇస్తామని చెప్పినా బడ్జెట్ లో ఆ ఊసే లేకుండా పోయింది.
ఉత్తరాంధ్రాలో కొత్తగా మరిన్ని వైద్య కళాశాలలను ఏపీ ప్రభుత్వం మంజూరు చేసింది వాటికి కూడా నిధులు ఇవ్వాలన్న ఆలోచన అయితే కేంద్రం చేయలేదు అన్న విమర్శలు ఉన్నాయి. విజయనగరం రైల్వే స్టేషన్ ని మోడల్ స్టేషన్ గా అభివృద్ధి చేస్తామని చాలా కాలంగా చెబుతున్నారు. కానీ బడ్జెట్ లో పైసా అయితే పెట్టలేదు. వాల్తేర్ డివిజన్ ని కంటిన్యూ చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు.
ఉత్తరాంధ్రా వెనకబడిన జిల్లాలతో నిండిన ప్రాంతం. తొలి మూడేళ్ళు నిధులు ఇచ్చిన కేంద్రం ఆ ప్యాకేజి కి స్వస్తి చెప్పేసింది. ఏ విధంగా చూసుకున్నా ఉత్తరాంధ్రాను దారుణంగా దెబ్బ తీసిన కేంద్ర బడ్జెట్ గానే చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పలు మార్లు కేంద్రానికి వినతులు చేసుకున్నా ఫలితం లేకపోతోంది అంటున్నారు. ఈ బడ్జెట్ ఏ మాత్రం అభివృద్ధికి దోహదపడేది కాదని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. ఈ వివక్ష బడ్జెట్ మీద కేంద్రాన్ని నిలదీస్తామని ఆయన అంటున్నారు.