ఒక చోట నష్టం వస్తే, దాన్ని మరో చోట పూడ్చుకుంటారు వ్యాపారులు. ఇది కనీస వ్యాపార సూత్రం. ఇప్పుడిదే పద్ధతిని టాలీవుడ్ నిర్మాతలు కూడా ఫాలో అవ్వాలని చూస్తున్నారు. ఏపీలో టిక్కెట్ రేట్లపై టాలీవుడ్ జనాలకు స్పష్టత వచ్చేసింది. ఏకంగా చట్టం చేసి మరీ టికెట్ రేట్లు పెంచేది లేదని, అదనపు ఆటలు ఉండవని స్పష్టంచేశారు ముఖ్యమంత్రి జగన్. దీంతో ఇప్పుడు తెలంగాణ థియేట్రికల్ మార్కెట్ పై పడ్డాయి పెద్ద సినిమాలు.
ఉన్నంతలో రేట్లు పెంచేసి, ఏపీలో రాబోతున్న నష్టాన్ని, తెలంగాణ బాక్సాఫీస్ నుంచి రికవర్ చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారంతా ఇందులో భాగంగా ఇప్పటికే అప్ కమింగ్ మూవీస్ కు సంబంధించిన నిర్మాతలంతా కలిసి ఓ మాట అనుకున్నారు. తమ మనసులో మాటను తెలంగాణ ప్రభుత్వం ముందు పెట్టేశారు. ఏకంగా మెమొరాండం కూడా సమర్పించారు.
రాబోయే రోజుల్లో తెలంగాణ థియేటర్లలో పెద్ద సినిమాలకు సంబంధించి టికెట్ రేట్లు భారీగా పెరగబోతున్నాయి. ఇది పక్కా. ఉదాహరణకు అఖండ సినిమానే తీసుకుందాం. తెలంగాణలోని సాధారణ థియేటర్లలో ఈ సినిమా టిక్కెట్లను 100 రూపాయల నుంచి 150 రూపాయలకు పెంచాల్సిందిగా కేసీఆర్ సర్కారుకు విజ్ఞప్తులు అందాయి.
ఆ తర్వాత థియేటర్లలోకి రాబోతున్న పుష్ప సినిమాకు సంబంధించి కూడా టికెట్ రేట్ల సవరింపుకు సంబంధించి విన్నపాలు అందాయి. సాధారణ థియేటర్లలో వంద రూపాయలుగా ఉన్న బాల్కనీ టికెట్లను 150కు పెంచాలని, 70 రూపాయల టికెట్ ను వంద రూపాయలు చేయాలని కోరుతున్నారు.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఏకంగా ఫ్లాట్ రేట్లు అడుగుతున్నట్టు తెలుస్తోంది. అంటే.. బాల్కనీ, బెంచ్ అనే తేడాలేకుండా మొత్తం 150 లేదా 200 రూపాయలు చేయాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కేవలం ఈ సినిమాలే కాదు, రాబోయే రోజుల్లో రాబోతున్న పెద్ద సినిమాలన్నీ తెలంగాణలో దాదాపు ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలని నిర్ణయించాయి. ఎలాగోలా తెలంగాణ ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకొని, ఆంధ్రాలో రాబోతున్న లాస్ ను భర్తీ చేసుకోవాలని చూస్తున్నాయి.
సాధారణ థియేటర్లలోనే రేట్లు ఇలా ఉన్నాయంటే, ఇక మల్టీప్లెక్సుల్లో ధరలు ఎలా ఉండబోతున్నాయో ఊహించుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఏపీతో పోలిస్తే, తెలంగాణలోనే మల్టీప్లెక్సులు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీనికితోడు అదనపు షోలు, వాటికి అదనపు రేట్లు కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమా రిలీజైనప్పుడు తెలంగాణ మల్టీప్లెక్సుల్లో టికెట్ రేట్లు ఊహించని విధంగా పెరగబోతున్నాయి. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తగ్గించడంతో, ఇప్పుడా ప్రభావం తెలంగాణ థియేటర్లపై పడబోతోంది.
అయితే వీటన్నింటిపై కేసీఆర్ సర్కారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణలో టికెట్ రేట్లపై ఆల్రెడీ క్యాపింగ్ సిస్టమ్ అమల్లో ఉంది. కానీ దాన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. ఈసారి కూడా అలా చూసీచూడనట్టు వదిలేస్తే పెద్ద సినిమాలు, ప్రేక్షకుల జేబుల్లోంచి అందినకాడికి పిండుకునే ఆస్కారం ఉంది. అలా కాకుండా ఏపీ తరహాలో కేసీఆర్ కూడా గట్టిగా దృష్టి పెడితే మాత్రం పెద్ద సినిమాలన్నీ పిసుక్కోవాల్సిందే.