ఈ రోజుల్లో సోషల్ మీడియాలో జరిగే ప్రచారంలో ఏది నిజమో, ఏది అబద్ధమో కనుక్కోవడం చాలా కష్టంగా మారింది. ఇది కూడా అలాంటిదే. తిరుపతిలో తాజాగా వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఓ వీడియో వైరల్ గా మారింది. అయితే అది ఫేక్ అని తేలింది.
భారీ వరదలకు తిరుపతిలోని ఇళ్లలోకి నీళ్లు చేరాయి. వాటితో పాటు చేపలు కూడా వచ్చాయి. అలా ఓ ఇంట్లో పదుల సంఖ్యలో నీటిలో తిరుగుతున్న చేపల వీడియో ఒకటి తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది. తిరుపతిలో వరద బీభత్సానికి ఇదొక ఎగ్జాంపుల్ అంటూ ఓ సెక్షన్ మీడియా కథలు కూడా అల్లేసింది.
అయితే నిజం ఏంటంటే.. ఆ వీడియోకు, తిరుపతి వర్షాలకు సంబంధం లేదు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలపై నిజానిజాలు వెలికితీసే కొన్ని సంస్థలు ఈ వీడియో వెనక వాస్తవాన్ని బయటపెట్టాయి. మలేషియాకు చెందిన వీడియో అది. అది కూడా ఇప్పటిది కాదు, 2020 నవంబర్ లో తీసిన వీడియో. అంటే సరిగ్గా ఏడాది కిందటిదన్నమాట.
ఆ వీడియోను కొంతమంది కాపీ చేసి, తిరుపతి వరదల కోసం వాడేశారు. ఇళ్లలోని భారీగా నీరు చేరిందని, ఆనకట్టలు తెగి ఇళ్లలోకి చేపలు వచ్చేశాయని ప్రచారం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలపై అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టారు.
మొన్నటికిమొన్న పెన్నా నదికి వరద పోటు ఎక్కువైందని, కట్ట తెగిందని ప్రచారం జరగడంతో సమీప ప్రాంతాల్లోని చాలా మంది ఇళ్లు ఖాళీ చేశారు. అధికారులు స్పష్టమైన ప్రకటన చేసి, తిరిగి అందర్నీ నివాసాలకు రప్పించారు. ఈ క్రమంలో పలు చోరీలు కూడా జరిగాయి. ఇకపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరగకుండా గట్టిగా కేసులు పెట్టాలని నిర్ణయించారు అధికారులు.