వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రెండు నెలల అనంతరం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. అయితే ఆమె పాదయాత్రను అధికార పార్టీ బీఆర్ఎస్ శ్రేణులు తిరిగి అడ్డుకుంటాయా? అనే అనుమానాలు తలెత్తాయి. పాదయాత్రలో షర్మిల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఇతర నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలను నోటికొచ్చినట్టు తిడుతున్నారని వారి ఆవేదన.
ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర చేస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు గొడవలు సృష్టించాయి. షర్మిల పాదయాత్ర ప్లెక్సీలను, అలాగే ఆమె బస చేసే కార్వాన్‌ను తగులబెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. పాదయాత్రలో బీఆర్ఎస్ శ్రేణులు ధ్వంసం చేసిన వాహనాన్ని స్వయంగా షర్మిల నడుపుకుంటూ కేసీఆర్ నివాసం వుంటున్న ప్రగతిభవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్‌లో ఇదో సంచలనానికి దారి తీసింది. షర్మిల ఇమేజ్ అమాంతం పెరిగింది.
అనేక నాటకీయ పరిణామాల మధ్య తెలంగాణ హైకోర్టు షర్మిల పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. అయితే వరంగల్ పోలీసులు మాత్రం ససేమిరా అన్నారు. మరోసారి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించి పాదయాత్ర చేసేందుకు అనుమతి సాధించారు. ఈ పరంపరలో ఇవాళ్టి నుంచి ఆమె పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలంలోని శంకరమ్మ తాండా నుంచి సాయంత్రం 3.30 గంటలకు పాదయాత్ర మొదలు పెట్టనున్నారు.
అంతకు ముందు మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. గవర్నర్ తమిళిసైతో షర్మిల భేటీ కానున్నారు. కేసీఆర్ సర్కార్‌పై తమిళిసై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వానికి తమిళిసై కొరకరాని కొయ్యగా మారారు. అలాంటి గవర్నర్‌తో షర్మిల చర్చించిన తర్వాత పాదయాత్రకు బయల్దేరడం ఆసక్తి రేపుతోంది.
శత్రువుకు శత్రువు మిత్రులనే భావనతో తమిళిసైని షర్మిల కలవనున్నారనే చర్చ లేకపోలేదు. పోలీసులు విధించిన షరతుల ప్రకారం ప్రభుత్వంపై షర్మిల విమర్శలు చేయకుండా ఉంటారా? ఒకవేళ ఏదైనా ఆరోపణ చేస్తే బీఆర్ఎస్ ఊరుకుంటుందా? ఇలాంటి అనేక ప్రశ్నల మధ్య షర్మిల పాదయాత్రపై ఉత్కంఠ నెలకుంది.