నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని టీడీపీ నేతలు విశ్వసించడం లేదా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. వైఎస్ కుటుంబానికి కోటంరెడ్డి అత్యంత విధేయుడు కావడమే కారణం. వైసీపీ కోవర్ట్ ఆపరేషన్‌లో భాగంగా సొంత ప్రభుత్వంపై ఘాటు విమర్శలకు దిగి, టీడీపీ పంచన చేరి, జగన్‌కు రాజకీయ ప్రయోజనం కలిగించాలనే వ్యూహం రచించారా? అని అనుమానిస్తున్నారు.
టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తాజా ట్వీటే ఇందుకు నిదర్శనం. తెలుగు తమ్ముళ్లను హెచ్చరిస్తూ చేసిన ఆ ట్వీట్ సంగతేంటో తెలుసుకుందాం.
“వైసిపి కోవర్ట్ డ్రామా స్టార్ట్ అయినట్లు ఉంది. రాబోయే వ్యూహం సినిమా స్క్రిప్ట్ అనుకుంటా…! జర జాగ్రత్త తెలుగు తమ్ముళ్లు” అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి పేర్లను ప్రస్తావించకపోయినా, వైసీపీలో అలజడు లను దృష్టిలో పెట్టుకునే బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా వేదికగా స్పందించారనే చర్చ జరుగుతోంది. అయితే వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడైన కోటంరెడ్డి ఎదురు తిరగడాన్ని టీడీపీ నేతలు నమ్మలేకున్నారు. అసలే కోటంరెడ్డి పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అనే విమర్శలున్నాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మనిషిగా టీడీపీలో చొరబడి, తమ విషయాలన్నీ వైసీపీకి చేరవేస్తారనే ఆందోళన టీడీపీ నేతల్లో నెలకున్నట్టు బుచ్చయ్య ట్వీట్ చెబుతోంది. వైసీపీలో తనను అనుమానిస్తున్నారని, ఆ అవమానాన్ని భరించలేనని కోటంరెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ కూడా అదే రీతిలో అనుమానిస్తోంది. టీడీపీ శ్రేణుల నమ్మకాన్ని కోటంరెడ్డి ఎలా పొందగలరో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.