యువగళం పేరుతో నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర టీడీపీలో కలకలం రేపుతోంది. లోకేశ్ పాదయాత్ర ఆయనకు, టీడీపీకి నూతన జవసత్వాలు తీసుకొస్తుందని పార్టీ శ్రేణులు విశ్వసించాయి. టీడీపీ ఆశించింది నెరవేరకపోగా, ఉన్న ఇమేజ్ కూడా పోతోందనే ఆవేదన నేతల్లో వుంది. లోకేశ్ పాదయాత్ర చేపట్టి నేటికి వారం రోజులైంది. ఆరు రోజుల్లో 72.3 కిలోమీటర్లు ఆయన నడక సాగించారు.
మొదటి రెండు రోజులు పాదయాత్రలో సందడి కనిపించింది. ఆ తర్వాత ఒక్కసారిగా పేలవంగా మారింది. అసలు లోకేశ్ పాదయాత్ర ఏపీలో జరుగుతోందన్న వాతావరణమే కనిపించడం లేదు. లోకేశ్ పాదయాత్రకు ముందు ఎల్లో మీడియా అద్భుతం ఏదో జరగ బోతున్నట్టు చిత్రీకరణ చేసింది. పాదయాత్ర మొదలైన తర్వాత, లోకేశ్‌కు వస్తున్న ఆదరణ చూసి, ఎల్లో మీడియా గుట్టుచప్పుడు కాకుండా జారుకుంది.
కనీసం లైవ్ ఇవ్వడానికి కూడా టీడీపీ భయపడుతోన్నదంటే… జనం నుంచి ఎంత మేరకు ఆదరణ లభిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. లోకేశ్‌కు వ్యక్తిగత సెక్యూరిటీ, స్థానిక నాయకులు తీసుకొచ్చిన జనం తప్ప, ప్రజలు స్వచ్ఛందంగా లోకేశ్‌ను కలవాలన్న వాతావరణం అసలు కనిపించడం లేదు. ఈ పరిస్థితిని టీడీపీ అసలు ఊహించలేదు.
పాదయాత్ర ద్వారా లోకేశ్ లీడర్‌గా తయారవు తారని భావిస్తే, అసలుకే ఎసరు వచ్చేలా వుందనే ఆందోళన చంద్రబాబులో వున్నట్టు సమాచారం. మరోవైపు కృత్రిమ సెట్టింగ్స్‌ను నెటిజన్లు వెంటనే కనిపెడుతున్నారు.
సోషల్ మీడియాలో లోకేశ్ పాదయాత్రలోని డొల్లతనాన్ని ఎప్పటికప్పుడు చీల్చి చెండాడుతున్నారు. లోకేశ్ పాదయాత్రపై మొదట్లోనే నెగెటివ్ టాక్ రావడం టీడీపీకి రాజకీయంగా దెబ్బ అని చెప్పొచ్చు. పాదయాత్ర మొదలు పెట్టిన దశలోనే ఇలా వుంటే, రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటనే ప్రశ్న టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.