‘తెలుగు’ మహిళ ఏదీ..? ఎక్కడ..?

తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు మహిళా నేతలు కూడా ఎక్కువగా కనిపించేవారు. పనుల్లోనూ, పదవుల్లోనూ మహిళలు కూడా కనిపించేవారు. ఎన్టీఆర్ హయాంతో పాటు.. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఈ ఆనవాయితీ కొన్నాళ్లు కొనసాగింది. అయితే ఇటీవల…

తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు మహిళా నేతలు కూడా ఎక్కువగా కనిపించేవారు. పనుల్లోనూ, పదవుల్లోనూ మహిళలు కూడా కనిపించేవారు. ఎన్టీఆర్ హయాంతో పాటు.. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఈ ఆనవాయితీ కొన్నాళ్లు కొనసాగింది. అయితే ఇటీవల పార్టీలో మహిళల ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. ఎన్నికల్లో ఓడిపోయాక మరీ తీసికట్టుగా తయారైంది.

మంత్రి పదవులు అనుభవించినవాళ్లెవరూ ఆ తర్వాత ఇటు తిరిగి చూడటం లేదు. తాజాగా ఆరు నెలల వైసీపీ పాలనపై పుస్తకం విడుదల చేసింది టీడీపీ.. ఈ కార్యక్రమంలో ఒక్క మహిళా మాజీ మంత్రి కూడా కనిపించకపోవడం గమనార్హం. కొంతకాలంగా పార్టీ తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తున్న పంచుమర్తి అనురాధ మినహా.. ప్రస్తుతానికి టీడీపీ తరపున ఎవరూ ముందుకు రావడం లేదు. మహిళా మాజీ మంత్రులైతే అడ్రస్ లేరు.

ఆ మధ్య చలో ఆత్మకూరు కార్యక్రమం సందర్భంగా హడావిడి చేసిన భూమా అఖిల ప్రియ కూడా వ్యక్తిగత వివాదాల వల్ల ఎలాంటి కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. 23 మంది ఎమ్మెల్యేలలో ఉన్న ఒకే ఒక్క మహిళ ఆదిరెడ్డి భవానీ కూడా సమీక్ష సమావేశాల వంటి ఇండోర్ కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు కానీ, ఆందోళనలు, నిరసనల్లో అస్సలు కనబడరు. ఇక మరో నేత సాధినేని యామిని పార్టీని వీడారు.

మొత్తమ్మీద టీడీపీలో మహిళా వాయిస్ పూర్తిగా పడిపోయింది. కొంతమంది పదవులున్నంత వరకే పార్టీ అనే పరిస్థితికి వచ్చేశారు. ఘోర పరాభవం తర్వాత సీనియర్ మంత్రులు, పార్టీ లాయలిస్ట్ లు అనదగ్గ చాలామంది టీడీపీకి దూరమయ్యారు.

లోకేష్ నాయకత్వంలో పార్టీకి భవిష్యత్తు కూడా లేదనేది వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే క్రమక్రమంగా టీడీపీకి సీనియర్లంతా మొహం చాటేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలుగు మహిళలు అడ్రస్ లేకుండా పోయారు.