నిన్న మొన్నటి వరకు విజయ్ దేవరకొండ అంటే హాట్ సీట్ హీరో. భయంకరమైన మార్కెట్. డిమాండ్..అలాంటివి అన్నీ ఒక్కసారిగా కిందకు జారిపోయాయి. నోటా, డియర్ కామ్రేడ్ లాంటి దారుణమైన ఫ్లాపులతో విజయ్ మార్కెట్ చెల్లాచెదురు అయిపోయింది. మీకు మాత్రమే చెప్తా లాంటి స్వంత సినిమా పరాజయాన్ని కూడా విజయ్ ఖాతాలోకి జమేసారు.
ఇప్పుడు ఇవన్నీ కలిసి విజయ్ తరువాత సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' మీద పడ్డాయి. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో కేఎస్ రామారావు నిర్మించే ఈ సినిమాను మరో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ చదలవాడ శ్రీనివాసరావు ఫస్ట్ కాపీని 24 కోట్లకు తీసుకుంటా అని ముందుకు వచ్చారు. నాలుగు కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు.
ఇదంతా ఆ సినిమా ప్రారంభించిన కొత్తలో సంగతి. కానీ ఇప్పుడు ఆ నాలుగు కోట్లు డెడ్ అయితే అయ్యాయి, సినిమా వద్దు అంటున్నారు. ఎప్పుడు రిటర్న్ ఇస్తే అప్పుడే వెనక్కు ఇవ్వండి, సినిమా అయితే వద్దు అని చదలవాడ శ్రీనివాసరావు నేరుగా ఈ విషయాన్ని నిర్మాత కేఎస్ రామారావుకే చెప్పేసినట్లు తెలుస్తోంది.
సినిమా ఫిబ్రవరిలో విడుదల. ఇప్పటి వరకు ఆంధ్రలో ఈ సినిమాకు ఒక్క ఎంక్వయిరీ కూడా రాలేదని, అందుకే చదలవాడ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అదృష్టం బాగుండి అంతా సరిగ్గా వుండి, వరల్డ్ ఫేమస్ లవర్ ఆడితే ఫరవాలేదు. లేదూ అంటే విజయ్ కు కష్టమే. అందుకే మైత్రీ హీరో సినిమాను పక్కన పెట్టి మరీ పూరి జగన్నాధ్ సినిమాను అర్జెంట్ గా స్టార్ట్ చేసేస్తున్నాడు విజయ్.