యూట్యూబ్ లో చాలామంది ఫుడ్ వ్లాగర్స్ రకరకాల వంటల్ని సబ్ స్క్రైబర్లకు పరిచయం చేస్తుంటారు. కొత్త కొత్త వెరైటీ రుచుల్ని వారికి చూపెడుతుంటారు. అరుదుగా దొరికే కాయగూరలు, మాంసాహార వెరైటీలను కూడా వీడియోల రూపంలో తెరపైకి తెస్తుంటారు. అలాంటి ఫుడ్ వ్లాగర్ ఈ యువతి.
చైనాకు చెందిన టిజి కొన్నాళ్లుగా ఫుడ్ వీడియోలు చేస్తోంది. ఆమె మొసలి మాంసం, ఆస్ట్రిచ్ పక్షుల మాంసంతో కూడా రకరకాల ఫుడ్ వీడియోలు చేసేది. ఇలాంటి వెరైటీ వంటకాలకు పెట్టింది పేరు కాబట్టే.. టిజి కి 78 లక్షలమంది ఫాలోవర్లున్నారు. చైనాలో ఇతర సోషల్ మీడియాపై ఆంక్షలుంటాయి కాబట్టి.. అక్కడ డౌయిన్, కౌషౌ అనే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ లో వాటిని అప్ లోడ్ చేసేది టిజి. డౌయిన్ పేరుతో ఉన్న అక్కడ టిక్ టాక్ లో టిజికి 78లక్షలమంది ఫాలోవర్లున్నారు.
అంతమంది ఫాలోవర్లు ఉన్న టిజి ఓ తింగరి పని చేసింది. వైట్ షార్క్ ని కూర చేసి వండుకుని తినే వీడియోని పోస్ట్ చేసింది. అంతే చైనా ప్రభుత్వం ఆమెకు 15 లక్షల జరిమానా వేసింది. చేపని కూర వండుకుని తినడం తప్పేనా అనుకోవచ్చు. కానీ చైనా ప్రభుత్వం గతంలో ఆ గ్రేట్ వైట్ షార్క్ ని అరుదైన జంతుజాలం లిస్ట్ లో చేర్చింది.
వైట్ షార్క్ ను వేటాడడం, కూర వండటం, తినడం అన్నీ నేరమే. సరిగ్గా అదే పని చేసింది టిజి. ఆ చేపని కోసి కూరవండటం, దాన్ని తినడం అన్నీ డీటెయిల్డ్ గా వీడియోలో చూపించింది. చిక్కుల్లో పడింది.
ఆలిబాబా ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ నుంచి ఆమె ఈ వైట్ షార్క్ ని కొన్నది. దాని పొడవు ఆరున్నర అడుగులు. దాని పక్కన పడుకుని ఫొటో దిగడంతో పాటు, లైవ్ స్ట్రీమింగ్ లో దాన్ని వండే వీడియో చేసింది టిజి. ఈ వీడియో చూసి ప్రభుత్వం జరిమానా విధించింది. ఆ తర్వాత ఆమె పాత వీడియోల వ్యవహారం కూడా బయటపడింది. మొసళ్లను చంపి కూర వండే వీడియోలు కూడా ఉండటంతో, టిజికి జరిమానా మరింత పెంచారు. మొత్తంగా 15లక్షలు ఫైన్ విధించారు.