వైసీపీ వ‌ద్దు… ఎమ్మెల్యే ప‌ద‌వి ముద్దా?

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఎట్ట‌కేల‌కు నాట‌కానికి తెర‌దించారు. గ‌త కొంత కాలంగా త‌న‌దైన నట‌నా చాతుర్యంతో ఆయ‌న ప్ర‌భుత్వంపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ వ‌చ్చారు. త‌ద్వారా ప్ర‌తిప‌క్షాల‌కు ఆయుధం ఇచ్చిన‌ట్టైంది. కోటంరెడ్డి…

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఎట్ట‌కేల‌కు నాట‌కానికి తెర‌దించారు. గ‌త కొంత కాలంగా త‌న‌దైన నట‌నా చాతుర్యంతో ఆయ‌న ప్ర‌భుత్వంపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ వ‌చ్చారు. త‌ద్వారా ప్ర‌తిప‌క్షాల‌కు ఆయుధం ఇచ్చిన‌ట్టైంది. కోటంరెడ్డి వ్య‌వ‌హార‌శైలిపై అనుమానం రావ‌డంతో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స్వ‌యంగా పిలిపించుకుని స‌మ‌స్య‌ల్ని అడిగి తెలుసుకున్నారు. దీంతో అంతా స‌ర్దుమ‌ణిగింద‌ని భావించారు.

కానీ కోటంరెడ్డి మ‌న‌సులో సీఎం జ‌గ‌న్‌పై కోపాగ్ని ర‌గులుతూనే వుంది. త‌న ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌పై విరుచుకుప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ఏకంగా సీఎం జ‌గ‌న్‌కే స‌వాల్ విసిరే ప‌రిస్థితి ఎదురు కావ‌డంతో వైసీపీ ఖంగుతింది. ఇవాళ మీడియాతో కోటంరెడ్డి మాట్లాడుతూ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి, ప్ర‌తిప‌క్షాల‌కు, ఎల్లో మీడియాకు కావాల్సినంత మేత అందించారు.

మ‌రోవైపు కోటంరెడ్డిని వైసీపీ సోష‌ల్ మీడియా టార్గెట్ చేస్తోంది. ద‌మ్ముంటే వైసీపీ ద్వారా వ‌చ్చిన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని స‌వాల్ విసురుతున్నారు. కోటంరెడ్డి సీరియ‌స్ కామెంట్స్‌ను తీసుకుని, ఆయ‌న‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

‘నన్ను అనుమానించే చోట నేను ఉండలేను. ఇంకా 15 నెలలు సమయం ఉంది. అయినా నేను నటిస్తూ ఉండలేను. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా. నన్ను వివరణ అడగకుండానే నెల్లూరు రూరల్‌కి ఇంచార్జ్ ని ప్రకటిస్తున్నారు’ అని ఆయ‌న వాపోయారు. అవ‌మానించే చోట ఉండ‌లేనంటూనే, వైసీపీ ద్వారా వ‌చ్చిన ఎమ్మెల్యే ప‌ద‌విని ఏ విధంగా అంటి పెట్టుకుందామ‌నుకుంటున్నావ్ అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ భిక్ష‌తో ద‌క్కిన ఎమ్మెల్యే ప‌ద‌వితో 15 నెల‌లు ఏ విధంగా న‌టించాల‌ని అనుకుంటున్నావ‌నే నిల‌దీత‌లు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా పౌరుషం వుంటే , వైసీపీ వ‌ద్ద‌నుకుంటే, ఆ పార్టీ ద్వారా సంక్ర‌మించిన ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నే స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. వైసీపీ మాత్రం వ‌ద్దు…ఎమ్మెల్యే ప‌ద‌వి మాత్రం ముద్దా కోటంరెడ్డి అని ప్ర‌శ్నిస్తున్నారు. వీటికి కోటంరెడ్డి ఏ విధంగా స‌మాధానం చెబుతారో చూడాల్సిందే.