ప్ర‌జానీకం గుండెల్లో తుపాను

ఇటీవ‌ల తుపాను కార‌ణంగా కురిసిన భారీ వ‌ర్షాల వ‌ల్ల రైతాంగం, ఇత‌ర వ‌ర్గాల ప్ర‌జానీకం తీవ్రంగా న‌ష్ట‌పోయింది. మ‌రీ ముఖ్యంగా తిరుప‌తి, ఇత‌ర ప‌ట్ట‌ణాల్లో లోత‌ట్టు ప్రాంతాలు మున‌క‌కు గుర‌య్యాయి. అలాగే క‌డ‌ప జిల్లాలో…

ఇటీవ‌ల తుపాను కార‌ణంగా కురిసిన భారీ వ‌ర్షాల వ‌ల్ల రైతాంగం, ఇత‌ర వ‌ర్గాల ప్ర‌జానీకం తీవ్రంగా న‌ష్ట‌పోయింది. మ‌రీ ముఖ్యంగా తిరుప‌తి, ఇత‌ర ప‌ట్ట‌ణాల్లో లోత‌ట్టు ప్రాంతాలు మున‌క‌కు గుర‌య్యాయి. అలాగే క‌డ‌ప జిల్లాలో అన్న‌మ‌య్య ప్రాజెక్టు తెగిపోయి ప‌దుల సంఖ్య‌లో మ‌నుషుల ప్రాణాలు పోయాయి. అలాగే కోట్లాది రూపాయ‌ల పంట న‌ష్టం సంభ‌వించింది.

చిత్తూరు, నెల్లూరు, క‌డ‌ప‌, అనంత‌పురం జిల్లాల‌తో పాటు క‌ర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు దెబ్బ‌తిన్నాయి. బ్రిడ్జిలు కూలిపోయి ర‌వాణా స్తంభించిపోయింది. రైల్వే ర‌వాణా మార్గం పూర్తిగా దెబ్బ‌తింది. దీంతో చాలా రైళ్లు ర‌ద్దు చేయాల్సిన ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి తుపాను హెచ్చ‌రిక‌…. ప్ర‌జానీకం గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తోంది.

నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు–శ్రీలంక తీరంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చ‌రిక‌తో ప్ర‌జానీకం అప్ర‌మ‌త్త‌మైంది. ఈ అల్పపీడనం మరింత బలపడి 26వ తేదీన తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 

దీని ప్రభావంతో 26, 27 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో, 27వ తేదీ వైఎస్సార్‌ జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు చెప్పారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం మధ్య ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉన్న‌ట్టు చెప్ప‌డం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది.  ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు కోరారు.

ఏ మాత్రం వ‌ర‌ద వ‌చ్చినా కొన్నిప్రాజెక్టులు తెగిపోతాయ‌నే ఆందోళ‌న నెల‌కుంది. ఈ ప‌రిస్థితుల్లో మ‌రోసారి తుపాను వ‌స్తే మాత్రం … ప‌రిస్థితి చేయి దాటిపోతుంద‌నే ఆందోళ‌న ఇటు అధికారుల్లోనూ, అటు ప్ర‌జానీకంలోనూ ఉంది. తుపాను గండం త‌ప్పి పోవాల‌ని యావ‌త్ ప్ర‌జానీకం అంతా కోరుకుంటోంది. ఎందుకంటే జ‌ల‌ప్ర‌ళ‌యాన్ని చూడాల‌ని ఏ ఒక్క‌రూ కోరుకోవ‌డం లేదు.