టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతి కేసులో జైలుపాలయ్యారు. దీంతో టీడీపీ కష్టాల్లో వుంది. కష్ట సమయంలో ఎవరైనా మద్దతుగా నిలిస్తే సంతోషిస్తారు. కానీ జనసేనాని పవన్‌కల్యాణ్ మద్దతుగా నిలుస్తూ, దూకుడు ప్రదర్శిస్తుండడంపై టీడీపీలో అనుమానం పెరుగుతోంది. ఇదే సమయం అనుకుని టీడీపీకి బదులు తాను రాజకీయంగా బలపడాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అనే అనుమానం టీడీపీలో బలపడుతోంది.
ఎందుకంటే బీజేపీకి జనసేన మిత్రపక్షం. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ సోమవారం ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. దీనికి జనసేన మద్దతు ప్రకటించింది. టీడీపీ బంద్‌కు మద్దతు ఇస్తున్నట్టు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి పేరుతో ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే తాము ఎలాంటి మద్దతు ఇవ్వలేదని, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పురందేశ్వరి ప్రకటించడం గమనార్హం.
మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే టీడీపీకి అసలేం జరుగుతున్నదో అర్థం కావడం లేదు. చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ నుంచి పవన్‌కల్యాణ్ హడావుడిగా విజయవాడకు వచ్చారు. పవన్‌ను రోడ్డు మార్గంలో రప్పించేలా వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే వాదన లేకపోలేదు. తద్వారా పవన్‌ను ఇబ్బంది పెట్టి, చంద్రబాబు ఎపిసోడ్‌ను పక్కదారి పట్టించాలనే ఎత్తుగడ వేసినట్టు చెబుతున్నారు.
వైసీపీ అనుకున్నదే జరిగింది. కృష్ణా జిల్లాలోకి పవన్ ఎంటర్ కావడం, పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై ఆయన పడుకుని నిరసన తెలిపారు. ఈ కారణంగా మీడియా అటెన్షన్ అంతా చంద్రబాబుకు బదులు పవన్ వైపు మళ్లింది. బాబుపై సానుభూతి చూపుతూ టీడీపీ శ్రేణుల్ని తనవైపు తిప్పుకునేందుకు పవన్‌కల్యాణ్ బీజేపీ డైరెక్షన్‌లో నడుస్తారా? అనే అనుమానం టీడీపీలో బలంగా వుంది. అందుకే రోడ్డుపై పవన్ పడుకుని నిరసన తెలపడాన్ని ఎల్లో మీడియా హైలెట్ చేయలేదు.
చంద్రబాబుకు రిమాండ్ విధించిన వెంటనే స్పందించిన నాయకుడు పవన్‌కల్యాణ్ మాత్రమే. అసలు పవన్ కల్యాణ్ జనసేన అధ్యక్షుడా? లేక టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంటా? అని ఆ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు సందేహించేలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పవన్ ఎందుకంత దూకుడు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. చంద్రబాబును జైలుకు పంపిన నేపథ్యంలో ప్రత్యామ్నాయం లోకేశ్ కాదు, తానే అని పవన్ నిరూపించుకోడానికే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా? అనే చర్చకు తెరలేచింది.
చంద్రబాబును అరెస్ట్ చేయించింది వైసీపీ ప్రభుత్వమే అని ఆరోపించడం వరకూ ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆయన్ను జైలుకు పంపడం అనేది న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశం. దాన్ని వదిలేసి జగన్ ప్రభుత్వంపై పవన్ అవాకులు చెవాకులు పేలారు. అన్నిటికి మించి మిత్రపక్షమైన బీజేపీతో సంబంధం లేకుండానే పవన్ తమకు మద్దతు ఇస్తున్నారా? అనేది టీడీపీ మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. అందుకే కష్టకాలంలో మద్దతుగా నిలుస్తున్నప్పటికీ పవన్‌ను నమ్మలేని పరిస్థితి ఏర్పడిందని టీడీపీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు అనడాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి వుంటుంది.