సమీక్ష: రాజావారు రాణిగారు
రేటింగ్: 2.5/5
బ్యానర్: ఎస్ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా 9
తారాగణం: కిరణ్ అబ్బవరం, రహస్య గొరాక్, రాజ్‌కుమార్ కాశిరెడ్డి, యజుర్వేద్ గుర్రం, స్నేహమాధురి శర్మ, దివ్య నార్ని తదితరులు
సంగీతం: జై క్రిష్
కూర్పు: విప్లవ్ నైషదం
ఛాయాగ్రహణం: విద్యాసాగర్ చింతా, అమర్దీప్ గుత్తుల
నిర్మాతలు: మనోవికాస్ డి., మీడియా 9 మనోజ్
రచన, దర్శకత్వం: రవి కిరణ్ కోల
విడుదల తేదీ: నవంబర్ 29, 2019
రవి కిరణ్ కోల దర్శకత్వం వహించిన 'రాజావారు రాణిగారు' కథని సింపుల్‌గా ఒకటే లైన్లో చెప్పుకోవచ్చు. ప్రేమించిన అమ్మాయికి తన ఫీలింగ్స్ చెప్పడానికి ఏళ్ల తరబడి వేచి చూసిన అబ్బాయి… అది వ్యక్తపరిచాడా, లేదా? ఈ సినిమా కథంతా ఇదే లైన్లో వుంది. ఈ సింగిల్ లైన్ కథని దర్శకుడు కనువిందైన ఫ్రేమింగ్‌తో, ఆకట్టుకునే పాత్రలతో, ఆహ్లాదమైన గోదావరి నేపథ్యంలో చెప్పాడు. ఈ అలంకరణలతో ప్రథమార్ధం వరకు సాఫీగా సాగిపోయినా కానీ ద్వితియార్ధంలో 'కాంటెంట్' లేని లోటు కొట్టొచ్చినట్టు తెలిసిపోయింది. ఆ మూగ ప్రేమని అంత సేపు సాగదీయడం కూడా సమస్యగా మారింది. అవే సన్నివేశాలు పదే పదే రిపీట్ అవడం, హీరోకి ఇన్సెక్యూరిటీ కలిగించేలా ఒక 'బావ' పాత్ర ఎంటర్ కావడం లాంటివి ఈ ప్రేమకథలోని ఫ్రెష్‌నెస్‌ని దూరం చేసాయి.
ఇటీవల వస్తోన్న ప్రేమకథల్లో పాశ్చాత్య పోకడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రేమించుకున్నారనగానే ఇక ముద్దులు, ఫిజికల్ అవడాలు చూపిస్తున్నారు దర్శకులు. ఇప్పటి ట్రెండ్ అలాగే వుందనేది దర్శకుల వాదన. అందుకు తగ్గట్టే వాటికే దక్కుతోంది ప్రేక్షకాదరణ. కానీ ఇందులోని హీరో 'రాజావారు' (కిరణ్ అబ్బవరం… తనలోని పెయిన్‌ని కళ్లతోనే అభినయించి చూపించాల్సిన పాత్రలో ఇతను చాలా బాగా రాణించాడు) ప్రేమలోని పవిత్రతకి అద్దం పడతాడు. తాను పవిత్రంగా వుండడమే కాకుండా స్నేహితుడు తన ప్రియురాలిని గడ్డిమేటు దగ్గరకు తీసుకువెళ్లినా లాక్కొచ్చేసి 'గడ్డి' పెడతాడు. దీంతో ఈ కథానాయకుడు పాత కాలం ప్రేమికుడిలా కనిపించే అవకాశం లేకపోలేదు.
అయితే ప్రేమలోని గాఢతని తెలియజేసే ఉద్దేశంతో దర్శకుడు ఈ కథానాయకుడిని మరీ డ్రమెటిక్‌గా చూపించాడు. 'ఇష్టమని చెప్పడం కష్టం కాదు కానీ నువ్వంటే ఇష్టం లేదంటే తట్టుకునే శక్తి లేదు' అని హీరోతోనే వివరణ ఇప్పిస్తాడు. అలాగే 'వాడంత ప్రేమిస్తే తప్ప వాడి బాధేంటో అర్థం కాదేమో' అంటూ స్నేహితులు సమాధాన పడినట్టు చూపిస్తాడు. ప్రేమను వ్యక్తం చేయకుండా భావాలని మనసులోనే దాచేసుకున్న హీరోలని గతంలోను చాలా చిత్రాల్లో చూసాం. ఇందులోని హీరో తాలూకు భయం, హీరోయిన్ మృదు స్వభావం అయితే పవన్‌కళ్యాణ్ 'తొలిప్రేమ'ని గుర్తు చేస్తాయి. అందులోని 'బాలు'లా 'రాజా' కూడా చాలా నిస్వార్ధమైన, నిజాయితీ కలిగిన ప్రేమికుడు. కాకపోతే బాలు ప్రేమకథ ఏ దశలోను బోర్ కొట్టదు, ఇరవయ్యేళ్ల క్రితం వచ్చినప్పటికీ ఇప్పటికీ పాతబడినట్టు అనిపించదు. ఆ కథని ఎమోషనల్‌గా టచ్ చేస్తూనే చాలా ఎంటర్టైనింగ్గా చెప్పగలిగాడు కరుణాకరన్. ఇందులోను వినోదం జోడించాలని ప్రయత్నించాడు కానీ అది కొన్ని సందర్భాలలో మాత్రమే పండించగలిగాడు రవి కిరణ్.
ముఖ్యంగా ఈ ప్రేమకథలో హీరో హీరోయిన్ల మధ్య ఆకట్టుకునే సన్నివేశాలని సృష్టించలేకపోవడంతో అతని సిన్సియర్ లవ్కోసం ఆడియన్స్ రూట్ చేసేలా కనక్ట్ చేయలేకపోయారు. ఏ మూమెంట్ కోసమయితే సినిమా అంతా జరుగుతుందో ఆ మూమెంట్ ఆడియన్స్‌ని ఏమాత్రం కదిలించలేనపుడు ఇక ఆ లవ్‌స్టోరీతో ఎమోషనల్ కనెక్ట్ లేనే లేనట్టు. 'తొలిప్రేమ' ఉదాహరణే తీసుకుంటే… ఎయిర్‌పోర్ట్‌లో వెళ్లిపోతూ అడుగు ముందుకు పడక వెనక్కి పరుగెడుతూ వచ్చి బాలు నుదుటిపై ముద్దు పెట్టుకుని అను తన ప్రేమని వ్యక్తపరిచే సన్నివేశానికి విజిల్స్ పడ్డాయి. సిమిలర్ సీన్‌ని బస్‌స్టాప్‌లో, వర్షంలో రీక్రియేట్ చేసే ప్రయత్నం ఇందులోను జరిగింది కానీ వీరిద్దరూ ఒక్కటవ్వాలనే ఎమోషన్ కలిగించలేకపోవడం వల్ల ఈ ప్రేమకథ తేలిపోయింది.
అయితే గోదావరి నేపథ్యంలో ఇంత అథెంటిక్‌గా, ఆ నేటివిటీని, భాషని చూపించిన సినిమాలు ఇటీవలి కాలంలో చాలా అరుదైపోయాయి. ఈ విషయంలో 'రాజావారు రాణివారు' ఫుల్ మార్క్స్ స్కోర్ చేస్తుంది. హీరో స్నేహితుల పాత్రలయినా, హీరోయిన్ స్నేహితురాళ్ల ప్రవర్తన అయినా, హీరోయిన్ తండ్రి మాట తీరయినా, హీరోయిన్ అమ్మమ్మ పెడసరి మాటలయినా, ప్రెసిడెంట్ పాత్ర చేసినతని వెటకారమయినా సరాసరి గోదావరి తీరంలో ఏదో పల్లెలోకి వెళ్లిన భావన కలుగుతుంది. చిన్న సినిమా అయినప్పటికీ సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నతంగా తెరకెక్కింది. ఛాయాగ్రహణం, సంగీతం అలరిస్తాయి. ఎడిటింగ్‌లోను చమక్కులు చూపించారు. క్వాలిటీ విజువల్స్‌తో విజువల్ అప్పీల్ పరంగా అస్సలు రాజీ పడలేదు.
దర్శకుడి పొయెటిక్ సెన్స్, లవ్ పట్ల అతనికున్న సెన్సిబుల్ థాట్స్ మెప్పిస్తాయి. అయితే మరీ ఓవర్ డ్రామాకి పోవడం వల్ల 'అవుట్ డేటెడ్' లవ్‌స్టోరీ తెరకెక్కించిన భావన ద్వితియార్ధంలో బాగా కలుగుతుంది. సహ నటీనటులంతా మెప్పించే నటన కనబరిచారు. హీరో స్నేహితులుగా నటించిన ఇద్దరూ విశేషంగా ఆకట్టుకుంటారు. మొత్తమ్మీద ఈ రాజా, రాణీలకి టైటిల్లో వున్నంత గౌరవప్రదమైన అలంకరణ అయితే కుదిరింది కానీ అలరించే లక్షణమే కొరవడింది. రాజావారంత పవిత్ర ప్రేమికులని టచ్ చేయగలుగుతుందేమో కానీ లేదంటే అసలు ప్రేమకథ కంటే కొసరు అలంకరణలు మాత్రమే గుర్తుంటాయి.
బాటమ్ లైన్: మూగ మనసులు!
గణేష్ రావూరి