అస్సలు గ్యాప్ తీసుకోవడం లేదు నాని. దసరా సినిమా ఇలా పూర్తయిందో లేదో మరో సినిమాను ప్రకటించాడు. ఈరోజు ఆ సినిమాకు కొబ్బరికాయ కొట్డాడు. రేపట్నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నాడు. కొన్నేళ్లుగా నాని అనుసరిస్తున్న పద్ధతి ఇదే.
ఇక ఇవాళ్టి విషయానికొస్తే… కెరీర్ లో 30వ చిత్రానికి శ్రీకారం చుట్టాడు నాని. శౌర్యువ్ అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ కొత్త సినిమా ప్రారంభించాడు. ఈరోజు జరిగిన ఈ మూవీ ప్రారంభోత్సవానికి చిరంజీవి చీఫ్ గెస్ట్. ఆయన క్లాప్ తో సినిమా లాంఛనంగా మొదలైంది.
హీరోయిన్ గా ఎంపికైన మృణాల్ ఠాకూర్ కూడా ఓపెనింగ్ కు హాజరైంది. ఈమెతో పాటు కొంతమంది దర్శకుల బృందం, మరికొంతమంది నిర్మాతల బృందం ఈ ఓపెనింగ్ కు అతిధులుగా హాజరయ్యారు.
తండ్రికూతురు అనుబంధంతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు దర్శకుడు. అటు హీరోయిన్ కాల్షీట్లు కూడా బల్క్ లో తీసుకున్నారు. రేపట్నుంచి ఏకథాటిగా షూటింగ్ చేయబోతున్నారు.
మధ్యలో దసరా సినిమా ప్రచారం కోసం చిన్న గ్యాప్ తీసుకోబోతున్నాడు నాని. దసరా సినిమా థియేటర్లలోకి వచ్చేసరికి, ఈ కొత్త సినిమా షూటింగ్ కనీసం సగం పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. 'హృదయం' ఫేమ్ హేషమ్ వహాబ్ ఈ ప్రాజెక్టుకు సంగీతం అందిస్తున్నాడు.