జనవరిలో వాల్తేరు వీరయ్య వచ్చింది. సూపర్ హిట్టయింది. ఇప్పుడు ఫిబ్రవరిలో చిరు నుంచి మరో సినిమా రాబోతోంది. చిరంజీవి నుంచి మరో సినిమా ఏదీ విడుదలకు సిద్ధంగా లేదు. అదే కదా మీ అనుమానం. ఇది చిరంజీవి పాత సినిమా.
చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన మూవీ గ్యాంగ్ లీడర్. ఇప్పుడీ మూవీని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 11న తెలుగు రాష్ట్రాల్లో సెలక్టివ్ థియేటర్లలో గ్యాంగ్ లీడర్ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజెస్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు హీరోల పుట్టినరోజులకు మాత్రమే పరిమితమైన ఈ ట్రెండ్, ఇప్పుడు రొటీన్ ప్రాక్టీస్ గా మారింది. పాత హిట్స్ ను మళ్లీ రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు ఓ కల్చర్ అయిపోయింది.
ఈ కల్చర్ లో భాగంగా ఇప్పటికే ప్రభాస్, బాలకృష్ణ, పవన్, మహేష్ నటించిన సినిమాలు కొన్ని రీ-రిలీజ్ అయ్యాయి. చిరంజీవి సినిమా కూడా ఒకటి రీ-రిలీజ్ అయింది. ఇప్పుడు వాటికి కొనసాగింపుగా గ్యాంగ్ లీడర్ ముస్తాబైంది.
ప్రస్తుతం మెగాఫ్యాన్స్ అంతా వాల్తేరు వీరయ్య సక్సెస్ తో హుషారుగా ఉన్నారు. అదే ఊపులో మరో 10 రోజుల్లో రాబోతున్న గ్యాంగ్ లీడర్ ను కూడా సక్సెస్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాలోని ఓ స్టిల్ నే, వాల్తేరు వీరయ్య సినిమా కోసం దర్శకుడు బాబి కాపీ కొట్టాడు.