జనవరి బాక్సాఫీస్ రివ్యూ.. వీరయ్య విన్నర్

జనవరి నెల సినిమాల్ని సంక్రాంతికి ముందు, సంక్రాంతి తర్వాతగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏటా సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఆ నెలలో డామినేషన్ కూడా దాదాపు అందులో ఓ సినిమాదే ఉంటుంది.…

జనవరి నెల సినిమాల్ని సంక్రాంతికి ముందు, సంక్రాంతి తర్వాతగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏటా సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఆ నెలలో డామినేషన్ కూడా దాదాపు అందులో ఓ సినిమాదే ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఈసారి మెగా డామినేషన్ కనిపించింది.

సంక్రాంతికి ఎప్పుడు సినిమాలు సిద్ధమైనా, అంతకుముందు వారం బాక్సాఫీస్ డల్ గా కనిపిస్తుంది. అది సహజం. ఈ జనవరిలో కూడా మొదటివారం అదే పరిస్థితి. ప్రత్యర్థి, మైఖేల్ గ్యాంగ్, దోస్తాన్, జర్నీ టు కాశీ లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. 3 రోజులాడితే అనుకునే ఉద్దేశంతో వచ్చిన ఈ సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి.

ఈ సినిమాల తర్వాత 24 గంటల గ్యాప్ లో వచ్చింది ఒక్కడు సినిమా. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా రీ-రిలీజ్ లో మెరిసింది. మొదటి రోజు మంచి సౌండ్ చేసింది. మహేష్ ఫ్యాన్స్ అంతా సంక్రాంతికి ముందే పండగ చేసుకున్నారు. అలా అని దీన్ని హిట్స్ జాబితాలో వేయలేం. లిమిటెడ్ థియేటర్లలో ఫ్యాన్స్ కోసం రిలీజ్ అయిన సినిమా ఇది.

ఇక తెగింపు సినిమాతో సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాకు తెలుగులో పెద్దగా ఆదరణ దక్కలేదు. అప్పటికే థియేటర్లు ఖాళీగా ఉండడంతో, అజిత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ టాలీవుడ్ రిలీజ్ గా తెగింపు సినిమాకు గుర్తింపు వచ్చింది. ఆ ఆనందం తప్ప ఈ సినిమాకు పెద్దగా టికెట్లు తెగలేదు.

ఇక బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో అసలైన సంక్రాంతి సందడి మొదలైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్ దక్కాయి. ఇంకా చెప్పాలంటే బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది వీరసింహారెడ్డి సినిమా. అయితే ఆ తర్వాత రోజు నుంచే ఈ సినిమాకు వసూళ్లు తగ్గిపోయాయి.

వీరసింహారెడ్డి తర్వాత కాస్త ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చాడు వాల్తేరు వీరయ్య. చిరంజీవి నటించిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. బాబి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు అన్ని ఏరియాస్ నుంచి హిట్ టాక్ వచ్చింది. అటు ఓవర్సీస్ లో కూడా సూపర్ హిట్టయింది. అలా వాల్తేరు వీరయ్య సినిమా ఈ ఏడాది సంక్రాంతి విజేతగా నిలిచింది.

బాలయ్య, చిరంజీవి సినిమాల తర్వాత వారసుడు, కల్యాణం కమనీయం సినిమాలు రిలీజ్ అయినప్పటికీ బాక్సాఫీస్ బరిలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. అప్పటికే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల కోసం ప్రేక్షకులు ఎగబడ్డంతో విజయ్ సినిమాకు వసూళ్లు పడిపోయాయి. ఇక సంతోష్ శోభన్ నటించిన కల్యాణం కమనీయం సినిమాను పట్టించుకున్న నాధుడు లేడు.

వాల్తేరు వీరయ్య నిలబడ్డంతో, ఆ తర్వాత వారం కొత్త సినిమాలేవీ రిలీజ్ అవ్వలేదు. మరీ ముఖ్యంగా సంక్రాంతి బరిలో నిలిచిన ఇతర సినిమాల థియేటర్లను సైతం వాల్తేరు వీరయ్యకు కేటాయించారు. అలా వరుసగా రెండో వారం కూడా వీరయ్య హల్ చల్ చేశాడు.

ఇక జనవరి చివరి వారంలో రిపబ్లిక్ డే కానుకగా హంట్ సినిమా వచ్చింది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు కాస్త ముందువెనక రిలీజ్ అయిన మాలికాపురం, సింధూరం, వాలంటైన్స్ నైట్ లాంటి సినిమాలేవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఇక రిపబ్లిక్ డే ఎట్రాక్షన్ గా వచ్చిన డబ్బింగ్ మూవీ పఠాన్, తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ వసూళ్లు సాధించింది.

ఓవరాల్ గా జనవరి నెలలో రిలీజైన సినిమాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. వాల్తేరు వీరయ్య ఆ లోటును భర్తీచేసింది. సిసలైన సంక్రాంతి విన్నర్ గా నిలవడమే కాకుండా.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ జాబితాలో కూడా ఈ సినిమా నిలవడం గ్యారెంటీ.