తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర టీడీపీ అభిమానులను కలవరపాటుకు గురి చేసే రీతిలో సాగుతున్నట్టుగా ఉంది. పాదయాత్ర మొదలై సరిగా నాలుగైదు రోజులు కూడా గడవకముందే లోకేష్ యాత్ర పేలవ స్థాయికి చేరింది. లోకేష్ పాదయాత్రకు సంబంధించిన ఫొటోలను టీడీపీ అనుకూల మీడియాలో వీక్షించినా ఆశ్చర్యం కలిగించే రీతిలో ఉంది వ్యవహారం.
లోకేష్ పాదయాత్రలో జనసందోహం ఊసు లేకుండా పోయింది. పట్టుమని నలభైయాభై మంది ఒరిజినల్ జనాలు కూడా లోకేష్ యాత్రలో కనపడకుండా పోవడం గమనార్హం! మరీ నాలుగో రోజుకు, అది కూడా కుప్పం నియోజకవర్గం పరిధిలోనే లోకేష్ పాదయాత్ర పరిస్థితి ఇలా ఉందంటే మొత్తం యాత్ర కామెడీగా మారిపోయేలా ఉందనుకోవచ్చు.
లోకేష్ వెంట ఆరు వందల మంది ఈ యాత్ర మొత్తం సాగుతారని తెలుగుదేశం అనుకూల మీడియానే అచ్చేసింది. వీరిలో లోకేష్ భద్రతా సిబ్బంది, పాదయాత్ర మొత్తం కొనసాగడానికి ఆసక్తితో ఉన్న అత్యంత ఉత్సాహ పరులు. వీరుగాక ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం వీరాభిమానులు కనీసం ఆ నియోజకవర్గం మేర అయినా పాదయాత్రలో కొనసాగవచ్చు. ఇలా చూసినా లోకేష్ పాదయాత్రలో కనీసం వెయ్యి మంది డెడికేటెడ్ సిబ్బంది ఉన్నారు.
అయితే కుప్పం పరిధిలో లోకేష్ యాత్రలో ఆ వెయ్యి మంది అయినా ఉన్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ వ్యవహారం ఎలా ఉందంటే.. తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాల్లో లోకేష్ పాదయాత్ర గురించిన ఫొటోలను చూస్తే.. ఎక్కడా ఒక్కటంటే ఒక్క లాంగ్ షాట్ ఫొటోనో, జనసందోహాన్ని చూపే డ్రోన్ షాటో, ఏరియల్ షాటో కూడా లేదు! అన్ని ఫొటోలూ లోకేష్ ను, ఆయన చుట్టూ ఉన్న ఐదారు మందిని చూపుతున్నవే ఉన్నాయి. లోకేష్ పాదయాత్ర ఫెయిల్యూర్ ఇలా పచ్చమీడియా సాక్షిగానే బయటపడుతూ ఉంది.