సమంత కు ఆరోగ్యం అంతగా బాగా లేకపోవడంతో తాత్కాలికంగా ఆగిన సినిమా ఖుషీ. డిసెంబర్ నుంచి సమంత షూట్ కు వస్తారని వినిపిస్తూనే వుంది. కానీ ఆమెకు కుదరడం లేదు. ఇలాంటి నేపథ్యంలో మార్చి ఫస్ట్ వీక్ లో వస్తారన్నది లేటెస్ట్ టాక్. ‘’.. ఒక వేళ సమంత రావడం ఇంకా ఆలస్యమైతే..’’ దర్శకుడు శివనిర్వాణ మరో ప్రాజెక్టు టేకప్ చేసే అవకాశం వుందని వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో అంతా హ్యాపీ అంటూ ఆయనే క్లారిటీ వచ్చారు. అసలు దీని అంతటి వెనుక ఏం జరిగింది?
విషయం ఏమిటంటే నాగ్ చైతన్య తరువాత సినిమా ఇంకా ఫిక్స్ కాలేదు. వెంకట్ ప్రభుతో సినిమా చేస్తున్నారు. చాలా మంది చైతన్య డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో శివనిర్వాణ అయితే చైతూ చేయడానికి సుముఖంగా వున్నారనే అభిప్రాయాలు వినిపించడం మొదలైంది. దాంతో పలువురు శివనిర్వాణను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. అప్పుడు శివ నిర్వాణ ‘ప్రస్తుతం తాను ఖుషీ కంప్లీట్ చేయాల్సి వుందని, ఒక వేళ ఖుషీ ఆలస్యమయ్యే పక్షంలో అది అలా వుంచి మరో సినిమా మైత్రీ కే చేయాలనే ఆలోచన కూడా వుందని’ వెల్లడించారని బోగట్టా.
అంటే ఖుషీ కనుక ‘ఆలస్యమైతే…’ శివ నిర్వాణ మైత్రీ వారికే మరో సినిమా చేసే ఆలోచనలో వున్నారన్నది సారాశం. అదే వార్తలుగా బయటకు వచ్చింది. అంతే కానీ ఖుషీ పక్కన పెట్టేసారని, ఖుషీ చేయరు అని, ఖుషీ ఆగిపోయిందనీ కాదు. ఈ వార్తలు చూసిన సమంత కాస్త ఫీలయిన మాట వాస్తవం. అది అలా నిర్మాతలు, దర్శకుడు వద్దకు చేరి, క్లారిఫికేషన్ ఇచ్చే వరకు వచ్చింది.
ఇదిలా వుంటే గౌతమ్ తిన్ననూరి సినిమా షెడ్యూలు ఎప్పటి నుంచి అనే డిస్కషన్లు స్టార్ట్ అయినపుడు కూడా మార్చి ఫస్ట్ వీక్ లో సమంత షూట్ కు వస్తే ఖుషి పూర్తి చేయాలని, ఒక వేళ రాలేకపోతే, అప్పుడు షెడ్యూలు ఆలోచన చేయాలని హీరో విజయ్ దేవరకొండ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద మార్చి ఫస్ట్ వీక్ లో సమంత షూట్ కు వస్తే అన్నీ ఆటోమెటిక్ గా మాయం అయిపోతాయ. ఖుషీ..ఖుషీగా ఖుషీ సినిమా రెడీ అయిపోతుంది.