నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు రాంగ్ టైమింగ్ లో మొదలైనట్టుగా ఉంది. అలాగే పాదయాత్ర కాన్సెప్ట్ కు నారా లోకేష్ తగిన వ్యక్తిగా కూడా కనిపించడం లేదు! ఏపీ రాజకీయ చరిత్రలో పాదయాత్రలు ప్రత్యేకంగా నిలిచాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర పెను సంచలనంగా నిలిచింది. ప్రజాస్వామ్య భారతంలో అంత సుదీర్ఘ పాదయాత్రను చేపట్టిన నాయకుడు లేరు. అలాంటి అరుదైన యాత్రను చేపట్టిన రాజశేఖర రెడ్డి ప్రజల మన్ననలనూ అదే స్థాయిలో పొందారు.
వైఎస్ పాదయాత్ర తో రాజకీయంగా చిత్తైన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత అధికారాన్ని అందుకోవడానికి పాదయాత్ర ద్వారా బయల్దేరారు. వాస్తవానికి చంద్రబాబు పాదయాత్ర వల్ల అధికారాన్ని అందుకున్నారనుకోవడం కూడా కరెక్ట్ కాదు. చంద్రబాబు పాదయాత్ర చేపట్టిన సమయానికీ 2014 ఎన్నికల నాటికి పరిస్థితులు మొత్తం మారిపోయాయి. రాష్ట్ర విభజన జరిగింది. బీజేపీ, పవన్ కల్యాణ్ లు కలిసి రావడంతో ఐదు లక్షల ఓట్ల తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అప్పుడు ఆధిపత్యాన్ని చలాయించింది. నిజంగానే చంద్రబాబు పాదయాత్రకు ప్రజలు చలించిపోయి ఉంటే.. 2014లో తెలుగుదేశం పార్టీకి దక్కాల్సింది ఆ మాత్రం సీట్లు కాదు. అవి కూడా పవన్ కల్యాణ్, బీజేపీల మద్దతు, మోడీ వేవ్ లేకపోతే వచ్చేవి కూడా కావని వేరే చెప్పనక్కర్లేదు.
ఇక వైఎస్ కూతురు షర్మిల ఉమ్మడి ఏపీలోనే సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆమె పాదయాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో ఉనికిని నిలపడంలో మాత్రం షర్మిల యాత్ర కీలక పాత్ర పోషించింది.
ఏపీ రాజకీయ చరిత్రను చూస్తే.. పాదయాత్ర ట్రెండ్ ను వైఎస్ సెట్ చేశారు. అయితే ప్రతి ఐదేళ్లకూ ఒకరు పాదయాత్ర చేసేస్తే మాత్రం ప్రయోజనాలు పెద్దగా దక్కింది లేదు. చంద్రబాబు పాదయాత్రకు గతంలో ఎంతో కొంత హైప్ వచ్చిందంటే అది ఆయన వరసగా రెండు సార్లు అధికారాన్ని కోల్పోయాకా చేపట్టింది.
2004లో ఓడిన వెంటనే 2009 ఎన్నికలకు ముందే చంద్రబాబు పాదయాత్రలంటూ వెళ్లలేదు. 2009లోనూ ఓడాకా పాదయాత్ర చేపట్టారు.
ఇక వైఎస్ జగన్ పాదయాత్ర సుదీర్ఘంగా విపరీత జనసందోహంతో కొనసాగడానికి ప్రధాన కారణం అప్పటికే జగన్ దాదాపు ఏడెనిమిదేళ్లుగా ప్రతిపక్షంగా ప్రజల్లో కొనసాగుతూ ఉండటం! 2010 నుంచి జగన్ దాదాపు ప్రతిపక్ష పాత్ర పోషించారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత చంద్రబాబు సీఎంగా అయ్యాకా కూడా ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ జగన్ జనంలోకి వెళ్లారు. అప్పటికే జగన్ పోరాడుతున్న తీరుకు ఆకర్షితులై ఆయన పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పట్టారు.
మరి మొన్నటి వరకూ అధికారంలో ఉండి.. ఇప్పుడు ఏదో ఇదైపోయిందని.. అప్పుడే లోకేషుడు పాదయాత్ర చేపట్టడం మాత్రం టూ ఎర్లీ అయినట్టుగా ఉంది. 2019 వరకూ తెలుగుదేశం చేతిలోనే అధికారం ఉండింది. అప్పుడు ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా లోకేష్ మంత్రయ్యారు! అప్పుడేమో సవాలక్ష హామీలతో గద్దెనెక్కి ఆ హామీలను తుంగలో తొక్కారు. మళ్లీ ఇంతలోనే.. అధికారం అధికారం అంటూ రోడ్డెక్కితే పట్టించుకునే వారెవరైనా ఉంటారా?
అధికారం యావతో లోకేష్ పాదయాత్ర ను చేపట్టారు. అయితే ఇది మరీ అతి అయిపోయింది. ఇచ్చిన హామీలన్నింటినీ జగన్ అమలు చేస్తూ ఉన్నారు. ఇంతలోనే లోకేష్ తెగ ఇదైపోతే ఇక్కడ నాటకీయత పండే చాన్సులు కూడా లేవు! ఇక లోకేష్ ఇమేజ్ కు పాదయాత్ర కాన్సెప్ట్ కూ ఇంచు సంబంధం కూడా లేదు! వెరసి .. తొందరపడి ఓ కోయిలా ముందే కూసిందీ! అన్నట్టుగా ఉంది లోకేష్ యువగళం వ్యవహారం. మరి ఈ ప్రహసనం ముందు ముందు ఇంకా ఎలా ఉంటుందో!