లోకేష్ పాదయాత్రను మీడియా పట్టించుకోవడంలేదా?

ఏపీలో వచ్చే ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్యగా మారిన సంగతి అందరికీ తెలుసు. చావో రేవో తేల్చుకోవాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది. అధికారంలోకి రావడానికి జనసేనను, బీజేపీని కూడా కలుపుకుపోవాలని తీవ్ర ప్రయత్నాలు…

ఏపీలో వచ్చే ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్యగా మారిన సంగతి అందరికీ తెలుసు. చావో రేవో తేల్చుకోవాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది. అధికారంలోకి రావడానికి జనసేనను, బీజేపీని కూడా కలుపుకుపోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆ ప్రయత్నాలు ఇప్పటివరకు ఓ కొలిక్కి రాలేదు. 

ఇక టీడీపీ రాజకీయాల్లో అత్యంత కీలక ఘట్టం చంద్రబాబు తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్ర. రాష్ట్ర విభజన జరగ్గానే ఏపీలో అధికారంలోకి రావడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేసి విజయం సాధించి కుర్చీ ఎక్కారు. ఆయన విజయం వెనుక అప్పట్లో బీజేపీ, జనసేన కూడా ఉన్నాయనుకోండి. విడిపోయిన రాష్ట్రాన్ని డెవెలప్ చేస్తారనే ఒక నమ్మకం కూడా ప్రజల్లో ఉండడంతో ఆనాడు ఆయన గెలిచారు. 

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకోమని బీజీపీ చెబుతోంది. పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ ఏమీ తేల్చడంలేదు. కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అది నామమాత్రమే. మరోసారి అధికారంలోకి రావాలని చంద్రబాబుకు ఉన్నా ఆయన పాదయాత్ర చేసే పరిస్థితి లేదు. ఇందుకు ఆయన వయసు కారణం. లోకేష్ ను గట్టి నాయకుడిగా ఎలివేట్ చేయడానికే ఆయనతో పాదయాత్ర చేయిస్తున్నారు. యువకుడు కాబట్టి చేయగలడు కూడా.  

లోకేష్ నాయకత్వానికి పనికిరాడని టీడీపీలోనూ, బయటా ఉన్న అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని తుడిచేయాలనే ఉద్దేశంతోనే లోకేష్ పాదయాత్ర తలపెట్టారు. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి టీడీపీ అధికారంలోకి వస్తే ఆ క్రెడిట్ ఆయనకు దక్కుతుంది. చంద్రబాబు తరువాత పార్టీ బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమమవుతుంది. అయితే పాదయాత్ర టీడీపీ నాయకత్వం ఆశించినట్లుగా సక్సస్ అవుతుందా అనేది అనుమానంగానే ఉందని కొందరి అభిప్రాయం. 

లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా 400 రోజుల పాటు 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. అంటే దాదాపు ఏడాదికిపైగా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. టీడీపీకి ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్ఠాత్మకం. లోకేష్ ను భావి నాయకుడిగా చూపించేందుకు ఇదో వేదికగా చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే పాదయాత్ర షెడ్యూల్ ను ప్రకటించిన నాటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. అయితే చంద్రబాబు పాదయాత్రలో చేపట్టిన ఫార్ములా ఇప్పుడు మిస్సవుతుండడమే అసలు లోపం. నాడు చంద్రబాబు పాదయాత్ర చేసే సమయంలో పార్టీకి గడ్డుకాలం. అప్పటికే రెండుసార్లు వరుస ఓటమితో జీవన్మరణ సమస్య. అందుకే పార్టీ శ్రేణులు నాడు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 

నాటి చంద్రబాబు యాత్రలో రెండు ఫార్ములాలకు పెద్దపీట వేశారు. ఒకటి ప్రచారం, రెండూ జన సమీకరణ. దాదాపు ఏపీలోని అన్ని మీడియా సంస్థలు పాదయాత్ర కవరేజ్ చేసేలా ప్లాన్ చేశారు. పెద్ద చానళ్ల నుంచి సిటీకేబుల్ వరకూ అందరికీ యాడ్లు ఇచ్చేవారు. అటు నియోజకవర్గాల బాధ్యులు జన సమీకరణ చేసేవారు. అందుకు అయ్యే ఖర్చులు అంతా వారే భరించేవారు. కానీ ఇప్పుడు లోకేష్ పాదయాత్ర అనుకూల మీడియా తప్పించి.. మిగతా వాటిలో కవరేజ్ కావడం లేదు. యాడ్స్ రూపంలో ప్యాకేజీ లేకపోవడమే ఇందుకు కారణం. అటు జన సమీకరణ కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. నియోజకవర్గ ఇన్ చార్జిలు ఖర్చుకు వెనుకడుగు వేస్తున్నారు. 

ఇప్పటికే బాదుడే బాదుడు, రాష్ట్రానికి ఇదేం ఖర్మ వంటి కార్యక్రమాలకు ఖర్చుపెట్టడంతో.. ఇక భరించలేమన్న రీతిలో ఉన్నారు. అయితే ఈ లోపాలన్నీ అధిగమించకుంటే మాత్రం లోకేష్ పాదయాత్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే చాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటి రోజు ఉన్నంత ఉత్సాహం, సందడి రోజులు గడిచే కొలదీ తక్కువ అవుతోంది. ప్రారంభం రోజున రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. అటు అనుబంధ విభాగాల ప్రతినిధులు, చివరకు చాలామంది ఎన్ఆర్ఐలు సైతం విచ్చేశారు. దీంతో ప్రారంభం అదిరిపోయింది. 

అయితే ఆ ఉత్సాహం చివరి వరకూ ఉంచుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ హైకమాండ్ పై ఉంది. మరి టీడీపీ నాయకులంతా కలసికట్టుగా లోకేష్ పాదయాత్రను విజయవంతంగా గట్టెక్కిస్తారా?