మళ్లీ మళ్లీ ఆ ఊసు వినిపించకుండా.. చాలా లోతుగా పాతాళం వరకు గోతిని తవ్వి చంద్రబాబునాయుడు పాతిపెట్టేశారు. దానిని చాలా జాగ్రత్తగా కప్పెట్టేశారు. గట్టిగా కాంక్రీటు వేసి సమాధి కూడా కట్టేశారు. ఆ సమాధిని పగల గొట్టాలంటే మాటలా? తర్వాత వచ్చిన జగన్ సర్కారు నానా పాట్లు పడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనే డిమాండ్ కు చంద్రబాబునాయుడు అంత బలమైన సమాధి కట్టిన తర్వాత, ఆ డిమాండ్ గురించి ప్రభుత్వంలో కదలిక తీసుకురావడం జగన్ సర్కారుకు ఒక పట్టాన సాధ్యం కావడం లేదు. మధ్యలో.. పాదయాత్ర అంటూ కొత్త డ్రామాకు తెరలేపిన చినబాబు లోకేష్.. ప్రత్యేకహోదా ఏదీ ఎక్కడ అంటూ ప్రశ్నల్ని సంధిస్తున్నారు.
నారాలోకేష్ కు పాదయాత్రలో పాపం చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రతిరోజూ ప్రభుత్వాన్ని తిట్టడానికి ఏదో ఒకటి మాట్లాడాలి. కానీ ఆయన వద్ద చాలా పరిమితంగా మాత్రమే అస్త్రాలు ఉన్నాయి. ప్రతిరోజూ అదే మాట్లాడుతూ ఉంటే.. ‘పాడిందే పాడరా పాచిపళ్ల..’ సామెతలాగా తయారవుతుంది. అలాగని నిందలు వేయడంలో కొత్త దనం చూపించడం ఆయనకు చేతకాదు. ప్రజలకు కొత్త వరాలు ప్రకటించగల సహృదయమూ లేదు. ఇన్ని కష్టాల మధ్య ఆయన పాదయాత్ర సాగుతోంది.
విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సన్నాహక సమావేశం కోసం జగన్ ప్రత్యేకవిమానంలో ఢిల్లీ వెళ్తున్నారనగానే.. లోకేష్ కు ప్రత్యేకహోదా గుర్తుకు వచ్చింది. ‘ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్లడమేనా.. ప్రత్యేక హోదా సాధించేది ఉందా’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అవినాష్ రెడ్డి కేసు కోసం కేంద్రం వద్ద మోకరిల్లుతున్నారని కూడా ఒక పాచిపోయిన నిరాధార ఆరోపణల్ని సంధిస్తున్నారు.
విమర్శలవరకు ఓకే గానీ.. అసలు ప్రత్యేకహోదా గురించి ప్రశ్నించే హక్కు తెలుగుదేశానికి, చినబాబుకు ఉన్నదా అనేది ప్రజల సందేహం. ఎందుకంటే.. ప్రత్యేకహోదా డిమాండ్ ను సర్వనాశనం చేసి, చంపి, పాతిపెట్టి, సమాధి కట్టినది చంద్రబాబునాయుడు. విభజన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కేంద్రంతో లాలూచీ పడింది. ప్రత్యేకహోదా కోసం ఉద్యమించిన రాష్ట్రప్రజలను అరెస్టు చేసింది. హోదా వద్దు ప్యాకేజీ చాలు అంటూ నిధులు స్వాహా చేయడం కోసం చంద్రబాబునాయుడు వంకర మార్గాలు అనుసరించారు.
ప్రత్యేకహోదా అనే పదం రాష్ట్రంలో వినిపించడమే పాపం అన్నట్టుగా నాలుగేళ్లు దుర్మార్గ పాలన చేశారు. బిజెపితో చెడిన తర్వాత.. హోదా అనే నింద వారి మీద వేసేస్తూ.. పాలనలో చివర కొంతకాలం.. హోదాకోసం పోరాటం పేరిట డ్రామా చేశారు. దాన్ని గుర్తించిన తెలుగుప్రజలు దారుణంగా ఓడించారు.
అలా.. అన్ని రకాలుగానూ, ప్రత్యేకహోదా డిమాండ్ ను సర్వనాశనం చేసిన చంద్రబాబునాయుడు కొడుకు, ఇవాళ జగన్ ను నిలదీయడమే పెద్ద కామెడీ. అందుకే ప్రత్యేకహోదా డిమాండ్ కు చంద్రబాబు కట్టిన సమాధి ఇంకా పగలడం లేదని, హోదా సాధన కోసం జగన్ నానా కష్టాలు పడాల్సి వస్తోందని అందరూ భావిస్తున్నారు.