చినజీయర్‌కు రాజకీయ ప్రేలాపనలు ఎందుకు?

కారణాలు ఏమైనా కావొచ్చు.. తెరవెనుక ఎవరు గ్రంథం నడిపించారనేది అప్రస్తుతం కూడా కావొచ్చు.మొత్తానికి చినజీయర్ కు పద్మ పురస్కారం లభించింది. అందుకు ఆయన హర్షం వ్యక్తం చేయడం వరకు బాగానే ఉంటుంది. కానీ రాజకీయ…

కారణాలు ఏమైనా కావొచ్చు.. తెరవెనుక ఎవరు గ్రంథం నడిపించారనేది అప్రస్తుతం కూడా కావొచ్చు.మొత్తానికి చినజీయర్ కు పద్మ పురస్కారం లభించింది. అందుకు ఆయన హర్షం వ్యక్తం చేయడం వరకు బాగానే ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలన్నీ కలసికట్టుగా పనిచేయాలని సందేశం ఇవ్వడమే తమాషాగా కనిపిస్తోంది. 

ఒకప్పట్లో కేసీఆర్ కు ఎంతో సన్నిహితంగా, మార్గదర్శకుడిగా మెలగిన ఈ రాజకీయ వాసనలు వీడని మఠాధిపతి చినజీయర్ తర్వాత బిజెపికి దగ్గరయ్యారనే గుసగుసలు బాగా వినిపించాయి. దానికి తగ్గట్టుగానే ఆయన రామానుజ చినజీయర్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అంత ఘనంగా నిర్వహిస్తే.. అప్పటికే ఆయనతో అనుబంధం చెడిన కేసీఆర్ అటువైపు కూడా వెళ్లలేదు. అదే సమయంలో ప్రధాని, రాష్ట్రపతి కేంద్ర ప్రముఖులు వచ్చి.. ఆ కార్యక్రమానికి హైప్ ఇచ్చారు. అప్పటికే ఆయన భాజపా ప్రియత్వం మొగ్గతొడిగినట్టుగా అందరు అనుకున్నారు. 

ఆ మొగ్గ వికసించి పండైనట్టుగా ఫలితం ఇప్పటికి కనిపించింది. చినజీయర్ ను పద్మపురస్కారమూ వరించింది. ఆ ప్రకటనపై ఆయన మాట్లాడుతూ అడగకుండా వచ్చిందని, తానెన్నడూ కోరుకోలేదని అన్నారు. అంతవరకు బాగానే ఉంది. అన్ని పార్టీలూ ప్రజలకు మంచే చేయాలని అనుకుంటాయి. ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప (ఎన్నికలనేది ఆయన ఉద్దేశం కావొచ్చు) మిగిలినప్పుడు అన్ని పార్టీలు కలిసి పనిచేయాలి అని ఆయన పిలుపు ఇచ్చారు. ఇప్పుడు రాజకీయాల్లో వ్యక్తిగత నిందలు దూషణలు పెరిగాయని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. బహుశా కేసీఆర్ , కేంద్రంలోని ప్రధాని మోడీ మీద చేస్తున్నదాడికి ఆయన బాధపడుతూ ఉండవచ్చు. 

అయినా.. ఈ ఆధ్యాత్మిక వేత్తకు రాజకీయ ప్రసంగాలు, పార్టీల ఐక్యత గురించిన సందేశాలు ఎందుకు?

ప్రతి మతం కూడా ప్రజలకు మంచి జరగాలనే కోరుకుంటుంది. అన్ని మతాలు కలిసి పనిచేయాలని పిలుపు ఇస్తే చినజీయర్ అందుకు సిద్ధమేనా? ఏదో కొన్ని మతపరమైన ఉత్సవాల వంటి సందర్భాల్లో తప్ప మిగిలిన వేళల్లో అందరూ కలసి పనిచేయాలంటే.. చినజీయర్ చర్చికి, మసీదుకు వెళ్లి ప్రజలకు మంచి జరగాలని ప్రార్ధనలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా?.

వేరే మతాల దాకా ఎందుకు.. వైష్ణవానికి నవతరం బ్రాండ్ అంబాసిడర్ అయిన చినజీయర్.. కనీసం హిందువుల్లోనే శైవాలయాలకు కూడా తరచుగా వెళుతూ పూజలు ప్రార్ధనలు చేస్తారా?. అనే ప్రశ్నలు ప్రజలనుంచి, లేదా స్వాములను అడగడానికి మొహమాటం పడని రాజకీయ నాయకుల నుంచి ఎదురైతే చినజీయర్ ఏం సమాధానం చెబుతారు? అసలు ఆయన వద్ద సమాధానం ఉంటుందా? అనేది పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న. ఏకం సత్ విప్రా బహుధా వదన్తి అనే సత్యం ఈ మఠాధిపతికి తెలియదా? అందువలన అన్ని మతాలు, అందరు దేవుళ్లు సమానం అని చెప్పవచ్చు కదా? 

ప్రజల్లో మెదిలే ఇలాంటి సందేహాలకు సమాధానం చెప్పడం చేతనైతే మాత్రమే.. చినజీయర్ రాజకీయ పార్టీలన్నీ ఐక్యంగా కలసి పనిచేయాలని సందేశం ఇవ్వడం బాగుంటుంది. లేకపోతే.. రాజకీయ వ్యాఖ్యల జోలికి వెళ్లకుండా అదుపు పాటిస్తే బాగుంటుంది.