కాషాయం, కాంగ్రెస్ కూటమి.. మనుగడ ఎన్నాళ్లు?

ఎట్టకేలకూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం పై శివసైనికుడు కూర్చున్నాడు. శివసేనానే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతటితో మహారాష్ట్ర రాజకీయాలకు రాబోయే ఐదేళ్లకు సంబంధించి శుభం కార్డు పడినట్టేనా? అనేక నాటకీయ పరిణామాల మధ్యన ఏర్పడిన ఈ…

ఎట్టకేలకూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం పై శివసైనికుడు కూర్చున్నాడు. శివసేనానే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతటితో మహారాష్ట్ర రాజకీయాలకు రాబోయే ఐదేళ్లకు సంబంధించి శుభం కార్డు పడినట్టేనా? అనేక నాటకీయ పరిణామాల మధ్యన ఏర్పడిన ఈ ప్రభుత్వం ఐదేళ్ల పాటు మనుగడ సాగిస్తుందా? అంటే.. అవి సమాధానం లేని ప్రశ్నలే ప్రస్తుతానికి.

అత్యంత ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే…దేశంలో బహుశా తొలిసారి ఒక కాషాయ పార్టీ, రెండు కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఒకరిది అజెండాలో హిందుత్వం ఉంది. మిగతా ఇద్దరిదీ పూర్తి లౌకిక వాద అజెండా. ప్రస్తుతానికి అయితే అజెండాలను పక్కన పెట్టి, అవి జెండాలను కలిపేశాయి!

కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన.. ఈ మూడు పార్టీలూ అధికారం కోసం మొహం వాచి ఉన్నాయి. కీలక పదవి చేపట్టాలనేది శివసేన కోరిక. ముఖ్యమంత్రి పీఠం తన చేతిలో ఉన్నంత సేపూ సేన ఈ ప్రభుత్వాన్ని కొనసాగనిస్తుంది. ఇక మళ్లీ ఎన్నికలు వస్తే తట్టుకునేందుకు అటు కాంగ్రెస్, ఇటు ఎన్సీపీ కూడా అంత రెడీగా లేవు. కేంద్రంలో అధికారం చేతిలో లేదు. కనీసం రాష్ట్రంలో అయినా అది ఉంటే చాలని ఆ పార్టీలు భావిస్తాయి. అందులో సందేహం లేదు.

కొన్ని కొన్ని విషయాల్లో ఆ పార్టీలు విబేధాలు, బేధాభిప్రాయాలతో ముందు ముందు రగడలు చేసుకున్నా..ప్రభుత్వాన్ని అయితే వీలైనన్ని రోజులు.. నెలలు.. సంవత్సరాలు.. కొనసాగించాలనే చూస్తాయి. కానీ వీరిని బీజేపీ ఊరికే అలా వదిలేస్తుందా? అనేది అత్యంత కీలకమైన అంశం!