బాగా పూర్వకాలంలో దొంగలు ఇళ్లకు కన్నాలు వేసి దొంగతనం చేసేవారు. ఇలాంటి కథలు చందమామలో చాలా చదువుకున్నాం. కాలక్రమంలో దొంగతనాల తీరు మారింది. ఎవడి తెలివిని బట్టి వారు రకరకాల పద్ధతుల్లో దొంగతనాలు చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడంతో సైబర్ దొంగతనాలు ఎక్కువైపోయాయి. సాధారణంగా దొంగలు ఏం ఎత్తుకుపోతారు. బంగారం, డబ్బు. వీటిని సులభంగా తీసుకొనిపోవచ్చు. కాబట్టి ఇంట్లో ఎవరూ లేనప్పుడు అంటే యజమానులు ఊరికి వెళ్లినప్పుడు ఏదోవిధంగా ఇంట్లోకి చొరబడి నగలు, డబ్బు ఎత్తుకుపోతారు. కాని నగలు, డబ్బు కూడా అవసరం లేని దొంగలు కొందరుంటారు.
అదేమిటి? అని ఆశ్చర్యం కలగొచ్చు. అవును మరి..ఇప్పుడు రోజులు అలా ఉన్నాయి. బంగారం,డబ్బు కంటే వేరేది అవసరం ఉంది. దాని మందు ఇవి తక్కువగా కనబడతాయి. పశ్చిమ బెంగాల్‌లో ఇలాగే జరిగింది. తూర్పు మిడ్నపూర్ జిల్లాలోని సుతహత ప్రాంతంలో దొంగలు ఓ షాపు నుంచి ఉల్లిపాయలు (ఉల్లిగడ్డలు అని కూడా అంటారు) ఎత్తుకెళ్లారు. క్యాష్ బాక్సులోని నగదు, ఇతర విలువైన వస్తువులు ఏమీ ముట్టుకోలేదు. ఈ ఉల్లిపాయల ధర 50 వేల రూపాయలు. దేశంలో ఉల్లిపాయల తీవ్ర కొరతకు ఇదో ఉదాహరణ. కోల్‌కతాలో ఉల్లిపాయల రేటు కేజీ వంద వరకు ఉందిమరి.
ఈమధ్య కాలంలో కొందరు కొత్త కొత్త వంటలు ప్రచారం చేస్తున్నారు. జనం నూనె లేకుండా తింటారేమోగాని 'ఉల్లిగడ్డలు' లేకుండా తినరు. కూరల్లో, పప్పుల్లో, టిఫిన్లలో, పిండివంటల్లో, మాంసాహారం వంటకాల్లో ఉల్లిగడ్డలు వేయకపోతే చిర్రెత్తుకొస్తుంది. 'ఇదొక వంటేనా..యాక్' అంటారు. ఇలా చిరాకు పడేవారంతా ఇప్పుడే ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే…దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డల కొరత కాబట్టి. కొంతకాలంగా ఉల్లిగడ్డల కొరతతో జనం అల్లాడిపోతున్నారు. ఉల్లి రేట్లు ఆకాశానికి అంటుతున్నాయి. ఉల్లిగడ్డలు కొనడానికే సంపాదనలో సగభాగం ఖర్చు చేయాల్సివస్తోందని గిలగిలలాడుతున్నారు. కొన్నిచోట్ల రేటు కిలో వందకు పైబడి ఉండగా, కొన్ని చోట్ల సుమారు వంద రూపాయల వరకు ఉంది.
దీంతో హోటళ్లలో ఉల్లి దోసె కరువైపోయింది. ఇంకా తప్పనిసరిగా ఉల్లితో చేసే టిఫిన్లు కనబడకుండాపోయాయి. ఎక్కడో ఒకటిరెండు చోట్ల చేసినా విపరీతమైన రేటు. కూరగాయల మార్కెటుకు వెళుతున్నవారు ఉల్లిగడ్డలు తేకుండానే వెనుదిరుగుతున్నారు. ఓ సమాచారం ప్రకారం …చెన్నయ్‌లో నెల కిందటి వరకు కేజీ 48 రూపాయలున్న ఉల్లి ఇప్పుడు 120 రూపాయలకు పెరిగింది. ఉల్లి కొరతకు ఇదో ఉదాహరణ. తమిళ ప్రజలు ఎక్కువగా బళ్లారి ఉల్లిగడ్డలు వాడతారు. ఇవి పెద్ద సైజులో ఉంటాయి. నాన్-వెజిటేరియన్ వంటకాల్లో ఎక్కువగా ఈ ఉల్లిగడ్డలు వాడతారు. ఈ ఉల్లిగడ్డలు ఎంత ఇష్టమైనా కొనలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉల్లిగడ్డలు వాడే అవసరం లేని వంటకాల కోసం అన్వేషణ సాగిస్తున్నారట…!
కొన్ని కుటుంబాలవారు తమకు తామే ఉల్లిగడ్డల రేషనింగ్ విధించుకుంటున్నారు. కేజీ ఉల్లిగడ్డలు అవసరమైతే పావు కేజీ కొనుక్కుంటున్నారు. డబ్బున్నవారు ఎక్కువమొత్తం కొనుగోలు చేసుకొని నిల్వ చేసుకుంటున్నారు. ఎక్కడైనా తక్కువ ధరకు ఉల్లిగడ్డలు అమ్ముతున్నారని తెలిస్తే పోలోమంటూ అక్కడికి పరుగులు తీస్తున్నారు. కొన్ని హోటళ్లలో ఉల్లిగడ్డలు అసలు వాడటంలేదు. కొన్ని హోటళ్లలో చాలా తక్కువగా వాడుతున్నారు. విదేశాల నుంచి భారీఎత్తున ఉల్లిగడ్డలు దిగుమతి చేసుకుంటున్నట్లు కొంతకాలం క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అవి వచ్చాయో రాలేదో తెలియదుగాని రేట్లు మాత్రం ఇంకా తగ్గలేదు. ఇండియాలో దేని రేట్లు పెరిగినా జనం సహిస్తారేమోగాని ఉల్లి రేట్లు పెరిగితే మాత్రం తీవ్రంగా ఆగ్రహిస్తారు.