ఆ సినిమా రేపు రిలీజ్ అవ్వడం లేదు

దాదాపు నెల రోజులుగా రామ్ గోపాల్ వర్మ హంగామా చేస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదల నిలిచిపోయింది. ఈ సినిమా విడుదలవ్వడం కష్టమని జనాలతో పాటు వర్మకు కూడా తెలుసు. అయినప్పటికీ అతడు…

దాదాపు నెల రోజులుగా రామ్ గోపాల్ వర్మ హంగామా చేస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదల నిలిచిపోయింది. ఈ సినిమా విడుదలవ్వడం కష్టమని జనాలతో పాటు వర్మకు కూడా తెలుసు. అయినప్పటికీ అతడు పబ్లిసిటీ ఆపలేదు. ప్రచారం చేస్తూనే ఉన్నాడు. అలా ఈ సినిమా ప్రచారానికే పరిమితమైంది. సినిమాను రేపు విడుదల చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమాను అదే టైటిల్, అదే కంటెంట్ తో విడుదల చేస్తే కులఘర్షణలు చెలరేగుతాయని, ప్రశాంతత దెబ్బతింటుందని పిటిషనర్ వాదించాడు. ఈ కేసుకు అనుబంధంగా సెన్సార్ బోర్డ్ అఫిడవిట్ దాఖలు చేసింది. సినిమాను ఇంకా చూడలేదని, సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపింది.

మరో వారం రోజుల్లో సినిమాను చూడాలని, నిబంధనల ప్రకారం అవసరమైన మార్పుచేర్పులు చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది కోర్టు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి మేకర్స్ కూడా కోర్టుకు తమ వాదనలు వినిపించారు. అవసరమైతే సినిమా టైటిల్ ను అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా మారుస్తామని, సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా అధికారుల్ని ఆదేశించాలని కోరింది. కానీ మేకర్స్ వాదనను కోర్టు తోసిపుచ్చింది.

విషయం కోర్టు వరకు వెళ్లడంతో ఈసారి సెన్సార్ బోర్డు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది.  ఎలాంటి అభ్యంతరాలు, వివాదాలు తలెత్తకుండా తమ కత్తెరకు మరింత పదును పెట్టబోతున్నారు అధికారులు. ఏమాత్రం అభ్యంతరకరం అనిపించినా, సదరు సన్నివేశాన్ని నిర్థాక్షిణ్యంగా కట్ చేయాలని భావిస్తున్నారు. పనిలోపనిగా మేకర్స్ చెప్పిన టైటిల్ కు కూడా సెన్సార్ బోర్డు ఓకే చెప్పే అవకాశం ఉంది. సినిమా రిలీజ్ ఆగిపోవడంతో, వర్మ నెక్ట్స్ స్టెప్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.