వెంకటేష్ కు రేచీకటి.. వరుణ్ తేజ్ కు నత్తి

ఎఫ్3 సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలా డీటెయిల్స్ బయటపెట్టాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఈసారి ఏకంగా తన సినిమాలో హీరోల పాత్రల్ని రివీల్ చేశాడు. డబ్బు చుట్టూ తిరిగే కథతో తెరకెక్కుతున్న ఎఫ్3 మూవీలో…

ఎఫ్3 సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలా డీటెయిల్స్ బయటపెట్టాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఈసారి ఏకంగా తన సినిమాలో హీరోల పాత్రల్ని రివీల్ చేశాడు. డబ్బు చుట్టూ తిరిగే కథతో తెరకెక్కుతున్న ఎఫ్3 మూవీలో వెంకటేష్ కు రేచీకటి ఉంటుంది. చీకటి పడితే ఏదీ కనిపించదన్నమాట. ఈ కోణంలో హిలేరియస్ కామెడీ పండుతుందని చెబుతున్నాడు రావిపూడి.

గతంలో కొంతమంది కమెడియన్లు రేచీకటి పాత్రలో నటించారు. రాజేంద్రప్రసాద్ హీరోగా ఓ సినిమాలో ఈ తరహా పాత్ర చేశాడు. మళ్లీ ఇన్నేళ్లకు వెంకటేష్, ఆ తరహా పాత్రతో నవ్వులు పూయించబోతున్నాడు. ఎఫ్2 కంటే రెట్టింపు వినోదం ఈ పాత్రలో చూస్తారని ధీమాగా చెబుతున్నాడు అనీల్ రావిపూడి.

వెంకీకి రేచీకటి పెట్టినట్టే, మరో హీరో వరుణ్ తేజ్ కు నత్తి యాడ్ చేశాడు ఈ దర్శకుడు. వెంకీ-వరుణ్ కలిసి చేసే హంగామా తన సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందంటున్నారు. ఎప్పట్లానే సినిమాలో వెంకటేష్ భార్యగా తమన్న, వరుణ్ తేజ్ భార్యగా మెహ్రీన్ నటించారు.

సెటప్ అంతా ఎఫ్2 ను తలపించినప్పటికీ, ఆ సినిమాలో ఉన్న చాలా పాత్రల్ని ఎఫ్3లో రిపీట్ చేయలేదంటున్నాడు అనీల్ రావిపూడి. సునీల్ లాంటి ఎంతోమంది టాలెంట్ ఉన్న నటుల్ని తీసుకున్నానని చెబుతున్నాడు. 

ఎఫ్2, ఎఫ్3 సినిమాల మధ్య కంపారిజన్స్ ఉండవని చెబుతున్న అనీల్.. ఎఫ్3లో ''అంతేగా..అంతేగా'' లాంటి ఊతపదాలు తక్కువగా ఉంటాయంటున్నాడు.