ఎవరి రాజధాని అమరావతి?

మూడు రాజ‌ధానుల‌పై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను అనూహ్యంగా ఉపసంహరించుకుంది. ఇదే విష‌యాన్ని హైకోర్టుకు కూడా తెలియ‌జేసింది. ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంపై అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి…

మూడు రాజ‌ధానుల‌పై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను అనూహ్యంగా ఉపసంహరించుకుంది. ఇదే విష‌యాన్ని హైకోర్టుకు కూడా తెలియ‌జేసింది. ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంపై అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌నపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ సీరియ‌స్‌గా స్పందించారు. మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని సీఎం చెప్పి రాష్ట్ర ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని పవన్‌ కల్యాణ్ విమ‌ర్శించారు. ఈ మేర‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

రాజధాని అమరావతికి సంబంధించి 54 కేసుల్లో హైకోర్టులో విచారణ జరుగుతుందని.. ఓటమి తప్పదని గ్రహించిన ప్రభుత్వం బిల్లుల రద్దుకు ఉపక్రమించిందని పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం కొత్త నాటకానికి తెర లేపిందని విమ‌ర్శించారు. ఉమ్మడి ఏపీ విడిపోయి ఏడున్నర సంవత్సరాలు గడుస్తున్నా రాజధాని ఎక్కడుంటుందో తెలియని స్థితికి ఈ పాలకులు తీసుకొచ్చారని ప‌వ‌న్‌ అసహనం వ్యక్తం చేశారు.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వేలాది ఎక‌రాల్లో రాజ‌ధాని ఏర్పాటు చేయ‌డంపై గ‌తంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏమ‌న్నారో తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. రోజుకో మాట‌, పూట‌కో మాట చెబుతూ గంద‌ర‌గోళానికి గురి చేస్తున్న‌దెవ‌రో నెటిజ‌న్లు ఆధారాల‌తో స‌హా స‌మాజం ముందు పెడుతున్నారు. ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో ట్రోలింగ్ చేస్తున్నారు.

ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్లే, త‌న అంత‌రాత్మ‌కు విరుద్ధంగా ప‌వ‌న్ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నార‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి?’ పుస్తకావిష్క‌ర‌ణ స‌భలో ప‌వ‌న్ చేసిన కీల‌క కామెంట్స్‌ని తెర‌పైకి తెచ్చారు. ఆ రోజు ప‌వ‌న్ ఏమ‌న్నారంటే…

‘రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించినప్పుడు సామాజిక ప్రభావం అంచనా వేయలేదు. సైబరాబాద్‌ కట్టే సమయంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం తమవారికి, అనుయాయులకు ముందుగానే విషయాన్ని చెప్పి ఆ చుట్టుపక్కల భూములు కొనిపిం చింది. రైతులు ఎకరా రూ.4-5 లక్షలకే అమ్ముకున్నారు. ఆ తర్వాత వాటిని కొన్నవారు అవే భూములను వందల కోట్లకు విక్ర యించుకున్నారు. ఆంధ్రా వాళ్లే మోసం చేశారని రైతులు కోపం పెంచుకున్నారు. 

ఇప్పుడు ఇక్కడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. రాజధాని ఎక్కడొస్తుందో ముందే తెలుసుకుని కొన్ని ఎకరాలను పట్టేసుకున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వారు వచ్చి అమరావతిలో ఇంటిస్థలం కొనుగోలు చేయగలరా? హైదరాబాద్‌లో చేసిన తప్పులే ఇక్కడా చేస్తున్నారు. అవి ఇలాగే కొనసాగితే కుల, వర్గ, అస్తిత్వ పోరాటాలు ముందుకొస్తాయి. మళ్లీ రాయలసీమ ఉద్యమం అని, మరొకటని ముందుకొస్తాయి’ అని నాటి స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ హెచ్చరించడాన్ని నెటిజ‌న్లు గుర్తు చేస్తున్నారు.

మ‌రి ప‌వ‌న్ మాట‌ల‌కు విరుద్ధంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేయ‌డం లేదు క‌దా? అలాంట‌ప్పుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ద్వంద్వ వైఖ‌రితో మాట్లాడ్డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. కుల, వర్గ, అస్తిత్వ, వేర్పాటువాద ఉద్య‌మాల‌కు అవ‌కాశాలు లేకుండా చేయాల‌నే స‌దాశ‌యంతోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం వికేంద్రీక‌ర‌ణ బిల్లును తీసుకొచ్చింద‌ని ప‌వ‌న్‌కు తెలియ‌దా? అని నిల‌దీస్తున్నారు. ఏమీ తెలియ‌ని వాళ్లకు చెప్పొచ్చ‌ని, అన్నీ తెలిసీ, న‌టించే ప‌వ‌న్ లాంటి వాళ్ల‌కు ఎవ‌రైనా ఏం చెప్ప‌గ‌ల‌ర‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఏమండోయ్ ప‌వ‌న్ గారూ… అర్థ‌మ‌వుతోందా?