కాటమరాయుడు కాదు.. కోతల రాయుడు

బిల్ గేట్స్ కి కంప్యూటర్ పాఠాలు చెప్పింది నేనే, హైదరాబాద్ కి పునాది రాయి వేసింది నేనే, హైటెక్ సిటీకి సాఫ్ట్ వేర్ తెచ్చింది నేనే, అబ్దుల్ కలాంకి విజన్ 2020 ఇచ్చింది నేనేనంటూ…

బిల్ గేట్స్ కి కంప్యూటర్ పాఠాలు చెప్పింది నేనే, హైదరాబాద్ కి పునాది రాయి వేసింది నేనే, హైటెక్ సిటీకి సాఫ్ట్ వేర్ తెచ్చింది నేనే, అబ్దుల్ కలాంకి విజన్ 2020 ఇచ్చింది నేనేనంటూ కథలు చెప్పడంలో చంద్రబాబు ముందుండేవారు. ఇప్పుడీ రూట్లోకే పవన్ నాయుడు కూడా వచ్చి చేరారు. ఈయన ఏకంగా ప్రధాని మోదీకే డైరక్షన్ ఇచ్చారట. అది కూడా దేశ సమగ్రత మీద.

ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ భాషకీ, ప్యాక్షన్ కీ ముడిపెడుతూ చేస్తున్న వ్యాఖ్యలే కాస్త విస్మయం కలిగిస్తున్నాయి. బాబులాగే పవన్ కి కూడా మతిస్థిమితం తప్పిందనే భావన కలుగుతోంది. దీనికి కొనసాగింపుగా పవన్ కల్యాణ్ విడుదల చేసిన తాజా ప్రెస్ నోట్ ఒకటి ఆయనలో ఉన్న గందరగోళాన్ని మరోసారి బైటపెట్టింది.

ఉత్తరాది, దక్షిణాది అని భారత్ వేరుపడుతోందట, దాన్ని సమైక్యంగా ఉంచడానికి జాతీయ నేతలు కృషిచేయాలట. స్థానిక భాష, స్థానిక సంస్కృతిని కాపాడుకోవాలట, దాని ద్వారా దేశ సమగ్రత పరిరక్షించబడుతుందట. ఇదీ పవన్ కల్యాణ్ ప్రెస్ నోట్ సారాంశం. ఇదే విషయం మోడీకి చెప్పారట జనసేనాని. పవన్ ఎంత గందరగోళంలో ఉన్నారో, ఆయన మాటల్లో కూడా అంతే గందరగోళం ఉంది.

మోదీ ప్రధాని అయ్యేవరకూ.. స్వతంత్ర భారత దేశానికి ప్రధానులుగా పనిచేసిన మిగతా వారెవరూ దేశ సమగ్రతను కాపాడలేకపోయారనే అర్థం వచ్చేలా మాట్లాడారు పవన్. కేవలం మోదీ ఒక్కరే బలమైన ప్రధానా? ఈ ప్రశ్నలకు జనసేనానే సమాధానం చెప్పాలి. తనకు తెలిసింది, తన చుట్టూ ఉన్నవాళ్లు చెప్పింది, పేపర్లో వచ్చిన ఆర్టికల్స్.. ఇవన్నీ మిక్స్ చేసి తానేదో కొత్తగా కనిపెట్టానని జబ్బలు చరుచుకుంటున్నారు పవన్ కల్యాణ్.

అసలింతకీ సడన్ గా పవన్ కి దేశ సమగ్రత ఎందుకు గుర్తొచ్చింది. తెలుగు మీడియంపై యూ టర్న్ తీసుకునే నిర్ణయంలో భాగంగా.. భాషకూ ఫ్యాక్షన్ కూ ముడిపెట్టిన పవన్ ఇప్పుడు మాతృభాషకూ దేశ సమగ్రతకూ సంబంధం పెట్టి మాట్లాడుతున్నారు. ఇంగ్లిష్ మీడియంను అడ్డంపెట్టుకొని ఏదేదో మాట్లాడుతున్న కాటమరాయుడు, ఇప్పుడు ఏకంగా కోతలరాయుడిగా మారిపోయారు.