ఏపీలో ఇంగ్లిషు మీడియం-తెలుగు మీడియం రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతోంది. అంటే ఏబీసీడీలు నేర్పించడంతోనే పిల్లలకు ఆంగ్ల బోధన ప్రారంభించాలనేది సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే పెద్ద రచ్చగా మారింది. ప్రతిపక్షాలు సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలన్న ఉద్దేశంతోనో, నిజంగా తెలుగు భాషపై అభిమానంతోనో, ప్రాథమిక దశలోనే ఇంగ్లిషు వద్దనే అభిప్రాయంతోనో మొత్తంమీద తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలను జగన్ సర్కారు, వైకాపా బడుగు బలహీన వర్గాలకు, పేదలకు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నాయి.
ప్రాథమిక దశ నుంచే ఇంగ్లిషు మీడియంలో చదవకపోతే పేదలకు ఉద్యోగాలు దొరకవని సర్కారు చెబుతోంది. ఇందులోని నిజానిజాలపై చర్చను అలా ఉంచితే…ఉన్నతస్థాయి పోటీ పరీక్షలను తెలుగులో రాయవచ్చని, వాటల్లో మంచి ర్యాంకుతో పాసైతే ఉన్నత ఉద్యోగాలు వస్తాయని, ఉన్నత చదువులకు అవకాశం ఉంటుందని కొంతమందికైనా తెలిసే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో రాసుకునే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో ఉన్నత చదువులు హిందీలో చదువుకునే అవకాశముంది.
హిందీ జాతీయ భాష కాబట్టి అందులో ఉన్నత విద్య అభ్యసించే వీలుందని కొందరు అనొచ్చు. కాని హిందీ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన భాష. ఆంగ్లం తప్పనిసరిగా అవసరం. కాని అదే సమయంలో మాతృభాషను (మనకు తెలుగు) పూర్తిగా కాదనుకోవడం, దానివల్ల ఉపయోగం లేదనుకోవడం అవివేకం. ఇండియన్ రైల్వేస్‌లో నియామకాల కోసం నిర్వహించిన పరీక్షల్లో 'తెలుగే టాప్' అని రైల్వే శాఖ మంత్రి సురేష్ అంగడి తాజాగా పార్లమెంటులో చెప్పారు.
తెలుగులో పరీక్ష రాసిన వారి సంఖ్య పది లక్షలకు పైగానే ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2017 నుంచి ఇప్పటివరకు అంటే మూడేళ్లలో రైల్వే పరీక్షలు రాసినవారు 47.18 లక్షలమంది. వీరంతా 13 భారతీయ భాషల్లో పరీక్షలు రాయగా తెలుగులో రాసినవారే అధికం. ఇక ఇంటర్ విద్యార్థులు చాలామంది జేఈఈ రాస్తుంటారనే సంగతి తెలిసిందే. ఇదీ కేంద్రం నిర్వహించే ప్రవేశ పరీక్షే. వచ్చే ఏడాది (2020) నుంచి జేఈఈ మెయిన్స్ తెలుగులో రాయొచ్చు.
జేఈఈ మెయిన్స్ జనవరిలో, ఏప్రిల్‌లో జరుగుతుంది. ఒకే అభ్యర్థి ఈ రెండు పరీక్షలూ రాయొచ్చు. ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. సివిల్ సర్వీసు పరీక్షలు ఎప్పటినుంచో తెలుగులోనూ నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూలు కూడా తెలుగులోనే చేస్తున్నారు. తెలుగులో పరీక్షలు రాసి, తెలుగులోనే ఇంటర్వ్యూ చేసినంత మాత్రాన ఉన్నతమైన సివిల్ సర్వీసు ఉద్యోగాలు రావడంలేదా? ఎంసెట్ తెలుగులో రాస్తున్న సంగతి తెలిసిందే కదా. అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాష తెలుగే. అమెరికా థింక్ ట్యాంక్ చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.
అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 2010-17 మధ్య అంటే ఏడేళ్లల 86 శాతం పెరిగినట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం తెలిపింది. అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ భాషల్లో తెలుగే అగ్రస్థానంలో ఉంది. అమెరికాలోని అమెరికన్లు తెలుగు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని అక్కడి తెలుగు సంఘాల నిర్వాహకులు చెబుతున్నారు. ఏది ఏమైనా మాతృభాష ఎందుకూ పనికిరాదు అనుకోవడం పెద్ద అపోహ అని చెప్పక తప్పదు.