తెలంగాణలో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య అవాంఛనీయ పోరు నడుస్తోంది. అది కాస్తా తెలంగాణ హైకోర్టుకు చేరింది. దీంతో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తెలంగాణలో గవర్నర్ తిమిళిసై, కేసీఆర్ సర్కార్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి విషయంలో తెలంగాణ ప్రభుత్వం సిఫార్సును గవర్నర్ తిరస్కరించారు. అప్పటి నుంచి కేసీఆర్ సర్కార్, గవర్నర్ మధ్య వైరం మొదలై… అంతకంతకూ పెరిగిపోతోంది.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 3న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. బడ్జెట్‌కు అనుమతి కోసం ఈనెల 21న గవర్నర్‌కు కేసీఆర్ సర్కార్ లేఖ రాసింది. ఇక్కడే జగడం తీవ్రం కావడానికి బీజం పడింది. బడ్జెట్ సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉందా? లేదా? చెప్పాలని కేసీఆర్ సర్కార్‌కు రాజ్‌భవన్ అధికారులు లేఖ రాశారు. గతేడాది గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి గవర్నర్, కేసీఆర్ సర్కార్ మధ్య సయోధ్య కుదరకపోగా, మరింతగా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్‌పై గవర్నర్ ఘాటు వ్యాఖ్యల గురించి తెలిసిందే. ఇప్పుడు తన ప్రసంగం లేకపోతే బడ్జెట్‌ను ఎందుకు ఆమోదించాలనే అభిప్రాయంతో గవర్నర్ తమిళిసై పట్టింపులకు వెళ్లినట్టు తెలుస్తోంది. తన విషయంలో సర్కార్ రూల్స్ పాటించకపోతే, తాను మాత్రం ఎందుకు ఆచరించాలనేది ఆమె ప్రశ్న.
ఈ నేపథ్యంలో బడ్జెట్‌ను శాసనసభ, అలాగే శానస మండలిలో ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ ఆమోదించకపోవడంపై కేసీఆర్ సర్కార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బడ్జెట్‌ను ఆమోదించేందుకు గవర్నర్‌ను ఆదేశించాలని కేసీఆర్ సర్కార్ హైకోర్టును కోరింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
2023-24 ఆర్థిక బడ్జెట్ విషయంలో గవర్నర్‌కు కోర్టు నోటీసులు ఇవ్వొచ్చా? లేదా? అనేది ఆలోచించుకోవాలని ప్రభుత్వ తరపు న్యాయవాది అడ్వొకేట్ జనరల్‌ను హైకోర్టు సూచించాలి. అలాగే కోర్టులు మితిమీరి జోక్యం చేసుకుంటున్నాయని మీరే కదా అంటుంటారని ఏజీకి హైకోర్టు సుతిమెత్తగా చురకలు అంటించింది. మొత్తానికి ప్రభుత్వ పిటిషన్‌పై విచారించేందుకు హైకోర్టు అంగీకరించడం గమనార్హం. గవర్నర్‌కు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.