నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. పిలిపించుకుని మరీ మాట్లాడి పంపినా, తన మాటకు విలువ ఇవ్వకుండా పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారని కోటంరెడ్డిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
తనపై ఇంటెలిజెన్స్ నిఘా వుంచిందని ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే తన వద్ద 12 సిమ్‌కార్డులున్నాయని, వాటిని ట్యాప్ చేసేందుకు చేతనైతే ఐపీఎస్ అధికారితో నిఘా పెట్టాలని కోటంరెడ్డి సవాల్ విసరడం అంటే పరోక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టుగానే సీఎం భావిస్తున్నారు. దీంతో కోటంరెడ్డి వ్యవహారశైలిపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని వైసీపీ అధిష్టానం ఆరా తీసినట్టు సమాచారం.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఇదే రీతిలో ప్రభుత్వ వ్యతిరేక కామెంట్స్ చేయడంపై సీఎం జగన్ కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. కనీసం ఆయన్ను పిలిచి కూడా మాట్లాడలేదని, కానీ కోటంరెడ్డి మొదటి నుంచి తమ వెంట నడుస్తున్నారనే అభిమానంతో జగన్ సానుకూల ధోరణితో చర్చించడాన్ని వైసీపీ పెద్దలు గుర్తు చేస్తున్నారు.
కోటంరెడ్డి వ్యూహాత్మకంగానే పార్టీకి నష్టం కలిగిస్తున్నారనే నిర్ణయానికి వైసీపీ పెద్దలు వచ్చారు. దీంతో కోటంరెడ్డి విషయమై నివేదిక పంపాలని నెల్లూరు జిల్లా వైసీపీ ముఖ్య నాయకుడు, మంత్రి కాకాణిని సీఎం ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. కోటంరెడ్డి, కాకాణి మధ్య కూడా విభేదాలున్నాయి. పరస్పరం వెన్నుపోటు పొడుచుకునేందుకు ఆ ఇద్దరు నేతలు సిద్ధంగా ఉన్నారని నెల్లూరులో ఎవరిని అడిగినా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డిపై చర్యలకు కాకాణి ఉత్సాహం చూపుతారా? లేక సీఎంకు సర్ది చెబుతారా? అనేది త్వరలో తేలనుంది. కోటంరెడ్డి విషయమై ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మాత్రం పక్కా.