తగ్గేదేలే.. 3 రాజధానులపై జగన్ మాట ఇది

అమరావతి రైతుల ఆనందం ఆవిరైంది. చంద్రబాబు సంతోషం కొన్ని గంటలకే పరిమితమైంది. ఎల్లో మీడియా ఆర్భాటం కొన్ని హెడ్ లైన్స్ కే పరిమితమైంది. మూడు రాజధానుల అంశంపై ఇలా వెనక్కితగ్గి, అలా 2 అడుగులు…

అమరావతి రైతుల ఆనందం ఆవిరైంది. చంద్రబాబు సంతోషం కొన్ని గంటలకే పరిమితమైంది. ఎల్లో మీడియా ఆర్భాటం కొన్ని హెడ్ లైన్స్ కే పరిమితమైంది. మూడు రాజధానుల అంశంపై ఇలా వెనక్కితగ్గి, అలా 2 అడుగులు ముందుకేశారు ముఖ్యమంత్రి జగన్. 

బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటిస్తూనే, ఆ స్థానంలో వికేంద్రీకరణకు మద్దతుగా మరింత సమగ్రమైన బిల్లుతో వస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు.

“3 రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని వివరించేందుకు, చట్టపరంగా అన్ని సమాధానాల్ని బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ విస్తృతంగా వివరించేందుకు,ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు.. ఇంతకుముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. ఇఁతకుముందు చెప్పిన అంశాల్ని పరిగణలోకి తీసుకొని తిరిగి పూర్తి సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తాం. విస్తృత-విశాల ప్రజాప్రయోజనాలు కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం.”

3 రాజధానుల అంశంపై ప్రస్తుతం కోర్టుల్లో నలుగుతున్న కేసులు ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్న సంగతి తెలిసిందే. వీటన్నింటికీ ఒకేసారి చెక్ పెట్టాలంటే, బిల్లును ఉపసంహరించుకోవాల్సిందే. ఆ స్థానంలో మరింత సమర్థంగా, సమగ్రంగా, చట్టపరంగా సమస్యలు తలెత్తకుండా మరో బిల్లును తీసుకొస్తే ఎలాంటి కోర్టు చిక్కులు ఉండవు. జగన్ ఇప్పుడు అదే చేయబోతున్నారు. 3 రాజధానుల అంశానికి తన మార్కు పరిష్కారం ఇవ్వబోతున్నారు.

“రాష్ట్రంలో బిగ్గెస్ట్ సిటీ విశాఖపట్నం. వైజాగ్ లో ఆల్రెడీ రోడ్లు, డ్రైనేజీ, కరెంట్, మౌలిక వసతులున్నాయి. కొద్దిగా వసతులు, సుందరీకరణపై దృష్టిపెడితే చాలు.. వైజాగ్ నగరం పదేళ్ల తర్వాత హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలతో పోటీ పడుతుంది. అప్పుడు రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందుతుంది. అందుకే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని, ఈ ప్రాంతంలో (అమరావతి) లెజిస్లేటివ్ క్యాపిటల్ పెట్టాలని, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్ పెట్టాలని అనుకున్నాం.”

వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, 3 రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే ఈపాటికే మంచి ఫలితాలు వచ్చి ఉండేవని అభిప్రాయపడ్డారు జగన్. వెనకబడిన ఉత్తరాంధ్రతో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆ బిల్లు పెట్టామని, మరోసారి హైదరాబాద్ మోడల్ వద్దని గతంలోనే ప్రజలు ఇచ్చిన తీర్పుతో వికేంద్రీకరణకు మొగ్గుచూపామని తెలిపిన జగన్.. చట్టపరమైన సమస్యల్ని అధిగమించేలా సమగ్రంగా మరో బిల్లుతో అసెంబ్లీలో అడుగుపెడతామన్నారు. 

వికేంద్రీకరణ నుంచి వెనక్కితగ్గేది లేదని ఈ సందర్భంగా మరోసారి విస్పష్టంగా ప్రకటించారు ముఖ్యమంత్రి.