ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న నేతలంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇళ్లకే పరిమితమైన తెలుగుదేశం పరాజితులంతా, ఇప్పుడు కొత్త గూటి కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఈ లిస్ట్ లో మొన్నటివరకు గంటా శ్రీనివాసరావు పేరు మాత్రమే బలంగా వినిపించగా, ఇప్పుడు ప్రత్తిపాటి పుల్లరావు పేరు తెరపైకి వచ్చింది.
చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి, మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. వైసీపీ ప్రభంజనం ముందు ఆయన చేతులు ఎత్తేయక తప్పలేదు. అలా ఓడిపోయిన పుల్లారావు, చాన్నాళ్ల పాటు ఇంటికే పరిమితం అయిపోయారు. టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు, కనీసం తన నియోజకవర్గంలో కూడా పర్యటించలేదు.
తన కుటుంబం, బంధువులకు సంబంధించిన కార్యక్రమాలకు మాత్రమే ఆయన బయటకు వచ్చేవారు. లేదంటే ఇంట్లోనే. అలా 5 నెలలుగా అజ్ఞాతవాసం గడిపిన పుల్లారావు, ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారంటూ కథనాలు వస్తున్నాయి. సుజనాచౌదరితో రెగ్యులర్ గా టచ్ లో ఉండే నేతల్లో ప్రత్తిపాటి కూడా ఒకరని అంటున్నారు.
ప్రత్తిపాటి పార్టీ మారితే తెలుగుదేశం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే. ఎందుకంటే గుంటూరు జిల్లాకు సంబంధించి అత్యంత కీలకమైన నేతల్లో ప్రత్తిపాటి ఒకరు. ఆయనే జెండా మార్చేస్తే, పార్టీకి ఆ జిల్లాలో ప్రతికూల పవనాలు తప్పవు.
ఒకరిద్దరు మినహా… తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వాళ్లలో చాలామంది భారతీయ జనతా పార్టీ వైపు వెళ్లడానికి మాత్రమే మొగ్గుచూపుతున్నారు. గతంలో తాము చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవాలన్నా, తమపై కేసులు పడకుండా ఉండాలన్నా, కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ వైపు వెళ్లడం తప్పనిసరి అనే విషయం వీళ్లకు అర్థమైంది. ఏపీలో బీజేపీకి సీన్ లేదని తెలిసినా, వీళ్లంతా కాషాయం కప్పుకోవడానికి తెగ ఉబలాటపడ్డానికి కారణం ఇదే.